హైదరాబాద్: భూకంపాలను ముందుగానే గుర్తించి, నియంత్రణా చర్యలకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేసినందుకు జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన అనుమల్ల శ్రీధర్‌కు దేశంలోనే ప్రముఖ విద్యాసంస్థ అయినా ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ (OU Doctorate) ప్రదానం చేసింది. ఓయూలో జియోఫిజిక్స్లో పీజీ పూర్తిచేసి, ప్రొ. రామరాజ్ మాథుర్ మార్గదర్శకత్వంలో రీసెర్చ్ స్కాలర్‌గా భూకంపాల గుర్తింపునకు అధునాతన పద్ధతులు, విపత్తు నిర్వహణ సంసిద్ధత వ్యూహాలను మరింత బలోపేతం చేయడంపై శ్రీధర్ అధ్యయనం చేశారు. దేశంలోని ‘దక్షిణ అండమాన్‌లోని పోర్ట్ బ్లెయిర్‌లో షాలో యాక్టివ్ ఫాల్ట్ సిగ్నేచర్లను గుర్తించే రిమోట్ సెన్సింగ్ జియోఫిజికల్ టెక్నిక్స్’ అనే అంశంపై లోతైన పరిశోధన చేశారు. భూకంపాలు రాక ముందే గుర్తించడమే ఈ అధ్యయనం లక్ష్యం కాగా, పోర్ట్ బ్లెయిర్ భూకంపం తర్వాత అధునాతన ఫాల్ట్ డిటెక్షన్ పద్ధతుల అవసరాన్ని తన పరిశోధన ద్వారా చాటి చెప్పారు. జియోలాజికల్ సర్వే కోసం అయస్కాంత, విద్యుదయస్కాంత పరికరాలను ఉపయోగించి సరికొత్త విధానానికి రూపకల్పన చేయగా, దీనిద్వారా భూకంప అంచనా, విపత్తుల నిర్వహణకు అవసరమైన సమాచారాన్ని సేకరించే వీలు కలిగింది. తన అధ్యయనం ద్వారా ప్రభుత్వ సంస్థలు విపత్తు నిర్వహణ బృందాలను ముందుగానే అప్రమత్తం చేసే అవకాశం ఉంటుందని, అదేవిధంగా ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను సంసిద్ధత వ్యూహాలను మెరుగుపరచడానికి కచ్చితమైన సమాచారంతో సన్నద్ధం చేయడానికి తోడ్పడతుందని శ్రీధర్ పేర్కొన్నారు. ఈ అధ్యయనం కోసం భౌగోళిక ప్రక్రియలు, ఊహించని సహజ దృగ్విషయాల యొక్క విస్తృత అవగాహనను పెంచేందుకు భౌగోళిక భౌతిక శాస్త్రంలో భవిష్యత్ పురోగతికి మార్గం సుగమం చేస్తుందన్నారు.
భూగర్భంలో జరిగే అంతు చిక్కని రహాస్యాలను తెలుసుకోవాలనే జిజ్ఞాసతో మొదలైన శ్రీధర్ ప్రయాణం… అదే విభాగంలో డాక్టరేట్ పొందే వరకు సాగింది. ఆయన ఆసక్తిని గమనించి ప్రొ. రామరాజ్ మాథూర్ ప్రోత్సహించడంతో ప్రకృతి విపత్తులకు సమర్థవంతంగా సన్నద్ధమయ్యే అవకాశం కల్పించే ఆధునాతన విధానానికి శ్రీధర్ రూపకల్పన చేసే స్థాయికి ఎదిగారు. శాస్త్రీయ అధ్యయనంపై మక్కువతో ఉస్మానియా యూనివర్సిటీలో స్కాలర్ గా చేరి ఎనిమిది జాతీయ, అంతర్జాతీయ పరిశోధన జర్నల్‌కు తన పరిశోధన అనుభవాలను పంచుకున్నారు. అదే విధంగా మరో ఐదు ఎడ్యుకేషన్ సెమినార్‌ల్లో పాల్గొని ప్రతిభ కనబర్చారు. ఈ రంగంలో తన నైపుణ్యాలను ప్రదర్శించి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందిన శ్రీధర్ జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ డిగ్రీ పీజీ కాలేజీలో చదివారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ కాలేజీలో జియోఫిజిక్స్ విభాగంలో చేరారు. ఆ తర్వాత నిర్వహించిన పీహెచ్డీ ఎంట్రెన్స్ ద్వారా ఉస్మానియా యూనివర్సిటీలోనే రీసెర్చ్ స్కాలర్‌గా చేరి ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విపత్తుల నిర్వహణ సవాళ్లను అధిగమించే నూతన విధానంపై అధ్యయనం చేశారు. తన పరిశోధనతో ముఖ్యంగా భూకంపాల విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొని ప్రాణ , ఆస్తి నష్టాన్ని తగ్గించుకునేందుకు దోహదపడుతుందనీ, మరిన్ని ఆధునాతన విధానాలను ఆవిష్కరించేందుకు బాటలు వేస్తుండటం గర్వంగా ఉందన్నారు. కాగా శ్రీధర్ అత్యున్నత ప్రతిభతో డాక్టరేట్ పొందడంపై ఓయూ విభాగం బోధన సిబ్బందితోపాటు, జగిత్యాల జిల్లా కేంద్రంలోని పలువురు హర్షం వ్యక్తం చేశారు.
Osmania University, Doctorate, Geophysics, PhD, Jagtial, Anumalla Sridhar Earthquake, SKNR Degree College