సుల్తాన్‌బజార్, ఏప్రిల్ 16: ఉస్మానియా వైద్య కళాశాలలో కొందరు సీనియర్ పీజీ వైద్య విద్యార్థుల వేధింపులకు జూనియర్ వైద్య విద్యార్థి బలయ్యాడు. వేధింపులు తాళలేకనే తమ కుమారుడు ఆత్యహత్మకు పాల్పడ్డాడని మృతుడి తల్లిదండ్రులు ఆరోపించారు. మహబూబ్‌నగర్ జడ్చర్ల జిల్లా పాలుగడ్డ తండాకు చెందిన కాట్రావత్ నాగమణి, కాట్రావత్ చందర్ దంపతులకు ఇద్దరు కుమారులు. మొదటి కుమారుడు సురేశ్ మహబూబ్‌నగర్ ఎస్వీఎస్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉస్మానియా దవాఖాన జనరల్ సర్జరీ విభాగంలో పీజీ వైద్య విద్యార్థిగా అడ్మిషన్ పొందాడు. పీజీ క్వార్టర్స్ హాస్టల్లో ఉంటున్నాడు. సీనియర్లు గత పది రోజులుగా అత్యధికంగా డ్యూటీలు వేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న విషయాన్ని సురేశ్ తన తల్లికి, మేనమామకు చెప్పాడు. గురువారం హాస్టల్ గదిలో పది మాత్రలు మింగి, ఇంజెక్షన్ తీసుకొని స్పృహకోల్పోయి కింద పడిపోయాడు. దీన్ని ఓ వైద్య విద్యార్థిని గుర్తించింది. తోటి విద్యార్థులతో కలిసి గది తలుపులు బద్దలు కొట్టి సురేశ్‌ను లేపేందుకు ప్రయత్నించింది. ప్రయోజనం లేకపోవడంతో క్యాజువాలిటీకి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు మృతిచెందినట్టు ధ్రువీకరించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలిస్తుండగా కుటుంబసభ్యులు అక్కడికి చేరుకొని ఆందోళనకు దిగారు.