Osmania Hospital | హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 30 ( నమస్తే తెలంగాణ ): గోషా మహల్లో 32 ఎకరాల స్థలంలో అత్యాధునిక హంగులతో ఉస్మానియా దవాఖానను నిర్మించబోతున్నట్టు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. శుక్రవారం ఆయన ద్విచక్ర వాహనంపై గోషామహల్ స్టేడియంలో తిరిగి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వందేండ్లకు ఉపయోగపడేలా ఈ దవాఖానను నిర్మించనున్నట్టు వెల్లడించారు. ఈ దవాఖానకు వచ్చే వారికి ట్రాఫిక్ సమస్యలు ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి..
గోషామహల్ పోలీస్ స్టేడియంలో ఉస్మానియా దవాఖాన నిర్మించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆనంద్‌కుమార్ గౌడ్ కోరారు. ఈ ప్రాంతంలో హాస్పిటల్‌ను నిర్మిస్తే వాతావరణం కలుషితమై ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలయ్యే ప్రమాదముందన్నారు.
సంతకాల సేకరణ
జనావాసాల మధ్య గోషామహల్ పోలీస్ స్టేడియం స్థలంలో ఉస్మానియా దవాఖాన నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు వినోద్ యాదవ్, కోటి శైలేశ్ కురుమలు డిమాండ్ చేశారు. ఈ మేరకు గోషామహల్తో పాటు పలు ప్రాంతాల్లో ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు.