హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్) ద్వారా ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్)కు మరింత మెరుగైన రోడ్డు సౌకర్యాన్ని కల్పించనున్నారు. నగరంలోని నలుమూలలను ఓఆర్ఆర్కు కలుపుతూ లింక్, మిస్సింగ్ రోడ్లను నిర్మించడంతోపాటు ఇప్పటికే ఉన్న 160 రోడ్లను 100 అడుగులకు విస్తరించనున్నారు. ఇందుకు రూ.2,600 కోట్లు అవసరమవుతాయని అంచనా. ఈ నిధులను రుణాల రూపంలో సమకూర్చేందుకు బ్యాంకులు ముందుకొచ్చాయి. దీంతో నగరం నుంచి ఓఆర్ఆర్కు ప్రయాణం మరింత సులువుతుంది. ఆయా ప్రాంతాల్లోని భూము ల ధరలు గణనీయంగా పెరగడంతోపాటు అక్కడ భారీ భవనాలను నిర్మించుకొనేందుకు అనుమతులు లభిస్తాయి. ఈ నేపథ్యంలో రోడ్లను అభివృద్ధి చేసే ప్రాంతాల్లోని స్థలాల యజమానుల నుంచి ఇంపాక్ట్ ఫీజు వసూలు చేస్తారు. ఈ ఫీజు చాలా తక్కువ మొత్తంలో ఉండేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్‌లో వెస్ట్ జోన్ మినహా మిగిలిన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు ఎక్కువగా జరగడం లేదన్న అపోహలు, అపవాదులకు తావులేకుండా రోడ్ల విస్తరణ ప్రణాళిక రూపొందించారు. బండ్లగూడ జాగీరు కార్పొరేషన్ పరిధిలో 6, శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 4, జవహర్‌నగర్‌లో 4, కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో 3, బడంగ్‌పేటలో 3, ఘట్కేసర్లో 3, దమ్మాయిగూడలో 3, మణికొండలో 2 రోడ్లను విస్తరించడంతోపాటు అవసరమైన చోట్ల బ్రిడ్జీలను నిర్మిస్తారు.