బేగంపేట్ జూన్ 6 : అనాథ బాలికపై లైంగికదాడికి పాల్పడిన యువకుడిని రాంగోపాల్‌పేట్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లేపల్లి విజయ్‌నగర్ కాలనీకి చెందిన సురేశ్(23) అదే ప్రాంతంలో జిరాక్స్ షాపులో పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో హాస్టల్లో ఉంటూ కళాశాలకు వెళ్లే ఇంటర్ చదువుతున్న ఓ అనాథ బాలిక (17)తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో నెక్లెస్ రోడ్డులో తన మిత్రుడి పుట్టిన రోజు వేడుకకు రావాలని ఆహ్వానించాడు. మే 20న కళాశాలకు వెళ్తున్నానని చెప్పి హాస్టల్ నుంచి బాలిక మరో ఇద్దరు స్నేహితులతో కలిసి బయటకు వచ్చింది.
అర్ధరాత్రి 12 గంటల సమయంలో అందరూ బర్త్‌డే వేడుకల్లో నిమగ్నమై ఉండగా సురేశ్ బాలికను కారులో ఎక్కించి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న గోల్కొండ ప్రాజెక్ట్ ఐసీడీఎస్ సూపర్వైజర్ హుమాయూన్ నగర్ పోలీసులకు ఈ నెల 4న ఫిర్యాదు చేసింది. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి రాంగోపాల్‌పేట్ పీఎస్‌కు బదిలీ చేశారు. కేసు నమోదు చేసి సోమవారం నిందితుడు సురేశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.