హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని 3,989 మంది మినీ అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ‘నమస్తే తెలంగాణ’లో మంగళవారం ‘మొదటి సంతకానికే మోసం’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి ప్రభుత్వం స్పందించింది. మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల నుంచే అమల్లోకి వస్తుందని పేర్కొన్నది. మెయిన్, మినీ అంగన్వాడీలు అనే తేడా లేకుండా అందరికీ రూ.13,600 చొప్పున వేతనం ఇవ్వాలని నిర్ణయించింది.
ప్రభుత్వ నిర్ణయంపై మినీ అంగన్వాడీ టీచర్లు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఏడాదిన్నరగా చేస్తున్న పోరాటం ఫలించిందని మినీ అంగన్వాడీ టీచర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి తెలిపారు. తమ ఆవేదనపై కథనం ప్రచురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేసిన ‘నమస్తే తెలంగాణ’కు, అలాగే మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వం నిరుడు జనవరిలో మినీ అంగన్వాడీలను అప్గ్రేడ్ చేసింది. కానీ, పెండింగ్ బకాయిల ఊసెత్తకుండా ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఆ తర్వాత జూన్, జూలై నెలల్లో పెరిగిన వేతనాలు అందించింది. సాంకేతిక కారణాల నెపం చూపి నిరుడు ఏప్రిల్, మేతోపాటు ఆగస్టు నుంచి 2025 మే వరకు పాత వేతనాలే ఖాతాల్లో జమచేసింది. ప్రభుత్వం తిరిగి అప్గ్రేడ్ చేసినందున పెండింగ్ వేతనాలు రూ.28 కోట్లు చెల్లించాలని అంగన్వాడీ టీచర్లు కోరుతున్నారు.