హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ) : మధ్యవర్తిత్వ విధానంలో కేసులను పరిషరించుకుంటే కక్షిదారులకు ఓటమి ఉండదని, ఇరుపక్షాలకూ విజయం చేకూరుతుందని హైకోర్టు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. తొలి ప్రయత్నంలో మధ్యవర్తిత్వం విఫలమైతే అంతటితో ఆగిపోకూడదని, ఇరుపక్షాలు మరోసారి అదే తరహా ప్రయత్నం చేసి ఏకాభిప్రాయంతో కేసును పరిషరించుకోవచ్చని తెలిపారు. సంప్రదాయ కేసులే కాకుండా క్లిష్టమైన కేసులను కూడా మధ్యవర్తిత్వ విధానంలో పరిషరించేందుకు అన్ని స్థాయిల్లోని న్యాయస్థానాలు ప్రాధాన్యమివ్వాలని ఢిల్లీకి చెందిన మధ్యవర్తిత్వ నిపుణులు సూచించారు.
‘మధ్యవర్తిత్వంలో మెళకువలు’ అనే అంశంపై హైకోర్టు న్యాయమూర్తులకు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా చేగూరు కన్హా శాంతివనంలో మూడు రోజులపాటు నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు బుధవారంతో ముగిశాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, ఢిల్లీకి చెందిన మధ్యవర్తిత్వ నిపుణులు జస్టిస్ నీనా బన్సాల్, జేపీ సింగ్, వీణారళ్లి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీ నవీన్‌రావు, రామచంద్ర మిషన్ అంతర్జాతీయ అధ్యక్షుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత కమలేశ్ డీ పటేల్ మాట్లాడారు. హైకోర్టు న్యాయమూర్తులు, లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం న్యాయమూర్తులు మొకలు నాటి, సాంసృతిక కార్యక్రమాలను నిర్వహించారు.