హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : ఆదివాసీ జాతిని హననంచేస్తున్న ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయడంతోపాటు తక్షణమే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో బేషరతుగా శాంతిచర్చలు జరపాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. దాదాపు 20 వేల మంది పోలీసు బలగాలు కర్రెగుట్టను చుట్టుముట్టి నరమేధం సృష్టించడం దుర్మార్గమని ఆయా పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే కర్రెగుట్టల నుంచి పోలీసు క్యాంప్‌లను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధూంభవన్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సహాయ కార్యదర్శి తకెళ్లపల్లి శ్రీనివాసరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య, సాధినేని వెంకటేశ్వరరావు, గోవర్దన్, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర నాయకుడు కేజీ రాంచందర్, ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, సీపీఐ-ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి ప్రసాదన్న, ఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి ఏ జానకి రాములు, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి రమేశ్‌రాజా, ఎస్‌యూసీఐ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ మురారి, ఫార్వర్డ్‌బ్లాక్ నాయకుడు ప్రసాద్ తదితరులు మాట్లాడారు. కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తక్షణమే కగార్ ఆపరేషన్‌ను నిలిపివేసి మావోయిస్టులతో బేషరతుగా చర్చలు జరపాలన్న డిమాండ్‌తో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మే 2న హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. సదస్సులో అన్ని పార్టీలు, వర్గాల అభిప్రాయాల మేరకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించనున్నట్టు తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కగార్‌ను నిలిపివేసి, మావోయిస్టులతో శాంతిచర్చలు జరపాలని ఆదివాసీ, దళిత, గిరిజన, ప్రజాసంఘాల నాయకులు మంగళవారం హనుమకొండలోని అంబేదర్ విగ్రహం వద్ద ప్రదర్శన నిర్వహించారు. ఆపరేషన్ కగార్తో ఆదివాసీలు, మహిళలు, చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. -హనుమకొండ చౌరస్తా