రాజన్న సిరిసిల్ల, మే 2 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ పన్నుల భారంతో మూతపడ్డ సిరిసిల్ల టెక్స్టైల్స్ పార్కు రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ చొరవతో మళ్లీ తెరుచుకున్నది. యారన్‌పై 12, వస్త్ర ఉత్పత్తులపై 5 శాతం కేంద్రం పెంచిన పన్నుల భారా న్ని మోయలేమంటూ వస్త్ర ఉత్పత్తిదారులు ఆదివారం పరిశ్రమలకు తాళం పెట్టారు. విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్.. తన వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్‌ను సోమవారం సిరిసిల్లకు పంపించారు. పరిశ్రమ మూసివేతకు దారితీసిన పరిస్థితులపై చేనేత జౌళిశాఖ ఆర్డీడీ అశోక్‌రావు, ఏడీ సాగర్, సెస్ చైర్మన్ గూడూరి ప్రవీణ్‌తో కలిసి టెక్స్టైల్స్ అభివృద్ధి కమిటీ అధ్యక్ష కార్యదర్శులు అన్నల్దాస్ అనిల్, అంకారపు కిరణ్, సభ్యులతో చర్చలు జరిపారు.
చర్చలు విజయవంతం కావడంతో మంగళవారం నుంచి వస్త్ర ఉత్పత్తులు ప్రారంభించనున్నట్టు కమిటీ నేతలు ప్రకటించారు. పార్కులోని యూనిట్లకు రావాల్సిన విద్యుత్తు రీయింబర్స్మెంట్ రూ.14.66 కోట్లకు సంబంధించిన జీవో జారీచేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్టు వారు తెలిపారు. సమస్య పరిష్కరించినందుకు కమిటీ నేతలు పార్కు ప్రధాన ద్వారం వద్ద సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. మూతపడ్డ టెక్స్టైల్స్ పార్కు కేటీఆర్ చొరవతో రెండు రోజుల్లోనే మళ్లీ తెరుచుకోవడంతో కార్మికులు సంతోషం వ్యక్తంచేశారు. టెక్స్టైల్స్ రంగం సంక్షోభానికి కేంద్ర విధానాలే కారణమని టెక్స్టైల్స్ అభివృద్ధి కమిటీ ఆరోపించింది. టఫ్ స్కీంలో ఉన్న 30 శాతం సబ్సిడీని 10 శాతానికి తగ్గించి అన్యాయం చేసిందని వాపోయింది.