
హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ అనాలోచిత విధానాలు, అడ్డగోలు నిర్ణయాలు రాష్ట్రంలోని విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కం)లకు పెనుభారంగా పరిణమించాయి. ఈ భారాన్ని అధిగమించేందుకు అనివార్యంగా విద్యుత్తు చార్జీలను పెంచాలని డిస్కంలు నిర్ణయించాయి. అయినా గృహ వినియోగదారులపై పెద్దగా భారం పడకుండా జాగ్రత్త వహించాయి. లోటెన్షన్ (ఎల్టీ) క్యాటగిరీలోని గృహ వినియోగ విద్యుత్తు చార్జీలను యూనిట్‌కు స్వల్పంగా 50 పైసల చొప్పున, ఎల్టీ క్యాటగిరీలోని గృహేతర వినియోగదారులతోపాటు హైటెన్షన్ (హెచ్‌టీ) క్యాటగిరీలోని వినియోగదారులందరికీ ప్రతి యూనిట్‌పై రూపాయి చొప్పున టారిఫ్‌లు పెంచాలని ప్రతిపాదించాయి. దీంతో గృహావసరాలకు నెలలో 50 యూనిట్లలోపు విద్యుత్తును ఉపయోగించుకొనేవారికి దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తొలిసారి చా ర్జీలు పెరగనున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2022-23) సంబంధించిన ఈ ప్రతిపాదనలను ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాలరావు సోమవారం రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (టీఎస్ ఈఆర్సీ) చైర్మన్ టీ రంగారావుకు సమర్పించారు. వచ్చే ఏడాది ఆదాయంలో రూ.10,928 కోట్ల లోటు ఏర్పడుతుందని అంచనా వేసిన డిస్కంలు.. విద్యు త్తు చార్జీల పెంపుతో అదనంగా రూ. 6,831 కోట్ల (ఎల్టీ క్యాటగిరీలో రూ.2,110 కోట్లు, హెచ్‌టీ క్యాటగిరీలో రూ.4,721 కోట్లు) ఆదాయం లభిస్తుందని తెలిపాయి. వ్యవస్థాగత సామర్థ్యా న్ని పెంచుకోవడంతోపాటు ప్రభుత్వ మద్దతు రూపేణా రూ.4,097 కోట్లు సమకూర్చుకొని ఆదాయ లోటును భర్తీ చేసుకోనున్నట్టు పేర్కొన్నాయి.
ఉచిత విద్యుత్తు, సబ్సిడీలు యథాతథమే
ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగంగా ఇప్పటివరకు కొన్ని వర్గాలకు ఉచితంగా, మరికొన్ని వర్గాలకు సబ్సిడీపై అందిస్తున్న విద్యుత్తును యథాతథంగా కొనసాగించాలని డిస్కంలు నిర్ణయించాయి. వ్యవసాయ రంగానికి, నెలలో 101 యూనిట్లలోపు విద్యుత్తును ఉపయోగించుకొంటున్న ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్తు లభిస్తుంది.
డిస్కంలకు కేంద్రం ఇచ్చిన షాక్‌లు
టన్ను బొగ్గుపై రూ.50గా ఉన్న సెస్సును క్లీన్ ఎనర్జీ పేరుతో రూ.400కు పెంచింది.
కొద్ది సంవత్సరాల వ్యవధిలోనే టన్ను బొగ్గు ధరను రూ.800 వరకు పెంచింది.
రైల్వేల్లో బొగ్గు రవాణా చార్జీలను గత 4 ఏండ్లలోనే 40 శాతం మేర పెంచింది.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచుతూనే ఉన్నది.
కేంద్ర విధానాలతో చార్జీల పెంపు అనివార్యం
రాష్ట్రంలో గత ఐదేండ్లుగా విద్యుత్తు చార్జీలను పెంచలేదు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల పెంచక తప్పడంలేదు. బొగ్గు ధరలను, రైల్వేల్లో బొగ్గు రవాణా చార్జీలను, క్లీన్ ఎనర్జీ సెస్‌ను కేంద్రం గణనీయంగా పెంచడమే ఇందుకు కారణం. అయినప్పటికీ గృహవినియోగదారులపై పెద్దగా భారం మోపకూడదని నిర్ణయించాం. యూనిట్‌కు 50 పైసలు మాత్రమే పెంచాలని ప్రతిపాదించాం. ప్రస్తుతం వ్యవసాయ రంగంతోపాటు సమాజంలోని అట్టడుగు వర్గాలకు ఉచితంగా ఇస్తున్న విద్యుత్తు, ఇతర వర్గాలకు ఇస్తున్న సబ్సిడీలు యథాతథంగానే కొనసాగుతాయి. – రఘుమారెడ్డి, సీఎండీ, ఎస్పీడీసీఎల్