హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : న్యాయవాద కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే టీజీ లాసెట్, పీజీ లాసెట్పై అభ్యర్థుల్లో ఆసక్తి తగ్గుతున్నది. ఇప్పటి వరకు 30,001 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. నిరుడు లాసెట్‌కు రికార్డుస్థాయిలో 60వేలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నిరుటితో పోల్చితే ఇప్పటి వరకు సగం దరఖాస్తులే వచ్చాయి. 2024లో 51వేలు, 2023లో 43వేలు, 2022లో 35వేల చొప్పున దరఖాస్తు చేసుకున్నారు.
ఈ ఏడాది మూడేండ్ల లాకు 21,259, ఐదేండ్ల లాకు 6,726, పీజీ లాసెట్‌కు 2016 మంది చొప్పున దరఖాస్తు చేసుకున్నారు. ఫిబ్రవరి 10 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఏప్రిల్ 1తో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగుస్తుంది. ఆ తర్వాత ఆలస్య రుసుముతో మాత్రమే దరఖాస్తు చేసే అవకాశమున్నది. మే 18న ఈ పరీక్ష నిర్వహిస్తారు.