హైదరాబాద్, అక్టోబర్14 (నమస్తే తెలంగాణ) : దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన జాబ్ పోర్టల్‌ను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక సచివాలయంలో సోమవారం ఆవిష్కరించారు. అనంతరం మహిళా సంక్షేమ శాఖ డైరెక్టరెట్ హెల్ప్‌లైన్‌లో 10 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దివ్యాంగులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాబ్‌పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు వెల్లడించారు. దివ్యాంగులు ఈ పోర్టల్‌లో పేర్లు రిజిస్టర్ చేసుకుంటే విద్యార్హతలను బట్టి ఉద్యోగాలు పొందే అవకాశముంటుందని తెలిపారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, దివ్యాంగుల సహకార కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య, జేడీ శైలజ, దివ్యాంగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.