కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 1: ఆన్లైన్ బెట్టింగ్ ఏకంగా ఓ కుటుంబాన్నే బలితీసుకున్నది. ఈ విషాద ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. బాలానగర్ ఏసీపీ హనుమంత్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న మంచిర్యాల వాసి వెంకటేశ్ (37) తన భార్య వర్షిణి (33)తోపాటు పిల్లలు రిషికాంత్ (11), విహాన్ (3)తో కలిసి గాజులరామారం బాలాజీ లేఅవుట్లోని ఓ అపార్ట్మెంట్లో మూడేండ్ల నుంచి అద్దెకు ఉంటున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్‌లకు అలవాటుపడ్డ వెంకటేశ్.. కొంత కాలం నుంచి తన జీతంతోపాటు తెలిసినవారి నుంచి తెచ్చిన అప్పులను సైతం బెట్టింగ్‌లలో పెట్టి తీవ్రంగా నష్టపోయాడు.
దీనిపై భార్యభర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో తీవ్ర మనోవేదనకు గురైన వెంకటేశ్.. కుటుంబమంతా చనిపోవాలని నిర్ణయించుకున్నట్టు శనివారం తెల్లవారుజామున తన తండ్రికి మెసేజ్ పంపాడు. అనంతరం భార్యతోపాటు ఇద్దరు పిల్లలను ముఖంపై దిండుతో అదిమిపెట్టి చంపిన వెంకటేశ్.. ఆ తర్వాత తాను కూడా ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫోన్ ద్వారా వెంకటేశ్ తండ్రి అందించిన సమాచారం మేరకు వాచ్‌మన్ వెళ్లి ఆ అపార్ట్మెంట్ తలుపులు కొట్టినా సమాధానం లేకపోవడంతో స్థానికుల సాయంతో పోలీసులకు ఫోన్ చేశారు. వారు వచ్చి బలవంతంగా తలుపులు తెరవడంతో అప్పటికే జరగరానిది జరిగిపోయింది. వేర్వేరు గదుల్లో వెంకటేశ్, ఆయన భార్య, పిల్లలు విగతజీవులై కనిపించడంతో మృతదేహలను గాంధీ దవాఖానకు తరలించారు. వెంకటేశ్ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.