పెద్దపల్లి, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ప్రాజెక్టులోని లింక్ 1,2లో ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. కాళేశ్వరం నుంచి నల్లగొండ జిల్లా సూర్యాపేట వరకు ఉన్న ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు వరకు యాసంగిలో సాగునీటిని సమృద్ధిగా అందించేందుకు లింక్ 1, 2లోని ఐదు పంప్‌హౌస్‌లు, మూడు బరాజ్‌లలోని 11 మోటర్లను ఆన్‌చేసి ఎత్తిపోతలు కొనసాగిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కన్నెపల్లిలోని లక్ష్మీ పంప్‌హౌస్‌లో రెండు పంపులు ఆన్‌చేసి 4,400 క్యూసెక్కుల నీటిని అన్నారంలోని సరస్వతీ బరాజ్‌లోకి, మంథని మండలం కాసిపేట సరస్వతీ పంప్‌హౌస్‌లోని మూడు పంపులు ఆన్‌చేసి 8,700 క్యూసెక్కులు మంథని మండలం సిరిపురంలోని పార్వతీ బరాజ్‌లోకి ఎత్తిపోస్తున్నారు.
అంతర్గాం మండలం గోలివాడలోని పార్వతీ పంప్‌హౌస్‌లోని రెండు మోటర్లు ప్రారంభించి 7,800 క్యూసెక్కులను ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎత్తిపోతలు కొనసాగిస్తున్నారు. ఎల్లంపల్లికి చేరిన కాళేశ్వరం జలాలను ధర్మారం మండలం నందిమేడారంలోని నందిపంపుహౌస్లోని రెండు బాహుబలి మోటర్లను నడిపి 3,200 క్యూసెక్కుల నీటిని అండర్ టన్నెల్ ద్వారా గాయత్రికి, రామడుగు మండలం గాయత్రి పంప్‌హౌస్‌లోని రెండు మోటర్లు ఆన్‌చేసి 6,400 క్యూసెక్కుల నీటిని ఎల్ఎండీలోకి తరలిస్తున్నారు.