హైదరాబాద్, ఆట ప్రతినిధి: స్వల్ప విరామం తర్వాత గురువారం నుంచి మొదలైన రంజీ ట్రోఫీలో మాజీ చాంపియన్ ముంబై తొలిరోజు అదరగొట్టింది. హైదరాబాద్‌తో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై బ్యాటర్లు సర్ఫరాజ్ ఖాన్ (142*) అజేయ శతకానికి తోడు సిద్ధేశ్ లాడ్ (104) కూడా సెంచరీ చేయడంతో ఆ జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 332 రన్స్ చేసింది. రోహిత్ (2/66) రెండు వికెట్లు తీయగా హైదరాబాద్‌కు సారథిగా వ్యవహరించిన స్టార్ పేసర్ సిరాజ్ (1/77) ఒక వికెట్ పడగొట్టాడు.
రాజ్‌కోట్: సౌరాష్ట్ర, పంజాబ్ మధ్య రాజ్‌కోట్‌లో జరిగిన మ్యాచ్‌లో ఒకేరోజు ఏకంగా 23 వికెట్లు నేలకూలాయి. పూర్తిగా బౌలర్లకు సహరించిన పిచ్‌పై ఇరుజట్లు తమ తొలి ఇన్నింగ్స్‌లను ముగించగా రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన సౌరాష్ట్ర.. 3 వికెట్లు కోల్పోయింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర.. హర్‌ప్రీత్ బ్రర్ (6/38) ధాటికి 47.1 ఓవర్లలో 172 రన్స్‌కు ఆలౌట్ అయింది.
తొలి ఇన్నింగ్స్‌లో పంజాబ్.. 40.1 ఓవర్లకు 139 రన్స్‌కే కుప్పకూలింది. ఆ జట్టు సారథి గిల్ డకౌట్ అయ్యాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర.. మొదటిరోజు ఆట చివరికి 24/3తో నిలిచి 57 పరుగుల ఆధిక్యంలో ఉంది.