ఎల్బీనగర్, జూలై 5 : నిరుద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లు, హక్కుల పరిష్కారం కోసం చేపట్టిన ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసి ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం దిల్సుఖ్నగర్, చైతన్యపురిలో ధర్నా నిర్వహించారు. పోలీస్ ఉద్యోగాలను 5 వేలకే పరిమితం చేయడం దారుణమని, వెంటనే 20 వేల పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు మద్దతుగా తెలంగాణ క్రాంతి వ్యవస్థాపకుడు పృథ్వీరాజ్, ఎమ్మెల్సీ కాంటెస్టెడ్ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘నిరుద్యోగుల ఆందోళన ప్రజాస్వామ్యబద్ధమైనది. వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదు. తక్షణమే వారి డిమాండ్లను నెరవేర్చాలి. పెండింగ్ ఖాళీలను భర్తీ చేయాలి’ అని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ నాయకులు ఇంద్రానాయక్, ఆకాశ్, నవీన్, శంకర్, శింబు, వంశీ, ప్రవీణ్, రాజు, మహేశ్, రవి తదితరులు పాల్గొన్నారు.