మహదేవపూర్, జూన్ 6 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ (లక్ష్మి )బరాజ్‌లోని(Medigadda) ఏడో బ్లాక్‌లో 18, 19 పియర్ల వద్ద ఇటీవల చేపట్టిన గ్రౌటింగ్ పనులు (Grouting works) కొనసాగుతున్నాయి. గ్రౌటింగ్ యంత్రాల సాయంతో బరాజ్‌లో మొత్తం 85 గేట్లకు గాను గతంలో 78 గేట్లు ఎత్తివేయగా, దెబ్బతిన్న పియర్ల వద్ద ఉన్న 20, 21 గేట్లు ఎత్తేందుకు వీలుకాకపోవడంతో ఆర్క్ గ్రౌగింగ్ పరికరంతో కట్ చేసే పనులు జరుగుతున్నాయి. ఏడో బ్లాక్‌లో 16వ గేట్ ఎత్తగా, 17 గేటు ఎత్తేందుకు నీటిపారుదల శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎన్డీఏఎస్ సూచన మేరకు మరమ్మతు పనులు చేపడుతున్నారు. బరాజ్‌లో లోపాలపై అధ్యయనం చేయడానికి బుధవారం వచ్చిన సీఎస్ఎంఆర్ఎస్ బృందం సభ్యుల పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ బృందం మరోవారం రోజులపాటు బరాజ్‌లో లోపాలపై పలు రకాల శాంపిల్స్‌ను సేకరించి క్షేత్ర స్థాయిలో పరిశీలన, పరీక్షలు చేయనున్నట్లు తెలిసింది. బరాజ్ దిగువన నీటి ప్రవాహానికి పియర్ల చుట్టూ ఉన్న ఇసుక కొట్టుకుపోకుండా యంత్రాల సాయంతో షీట్‌ఫైల్స్ అమర్చుతున్నారు. డౌన్, అప్ స్టీమ్‌లో సీసీ బ్లాక్‌లను తీసి అమర్చుతున్నారు.