రంగారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగు పడి ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాదకర సంఘటన చౌదరిగుడా మండలం ఎదిర గ్రామ శివారులో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అకాల వర్షానికి గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు తలదాచుకునేందుకు ఓ చెట్టుకిందకు వెళ్లారు. ఇదే సమయంలో వీరిపై పిడుగుపడటంతో సంఘటనా స్థలంలోనే ఓ మహిళ మృతి చెందగా మరొక మహిళను దవాఖానకు తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు గ్రామస్తులు తెలిపారు.