వర్ధన్నపేట, నవంబర్ 20 : వైద్యుల నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో గురువారం జరిగింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం గర్మిళ్లపల్లికి చెందిన బాలబోయిన మల్లయ్య(60) మండలంలోని ఇల్లంద గ్రామానికి చెందిన తన సమీప బంధువు ఇంట్లో బుధవారం జరిగిన వేడుకకు హాజరయ్యాడు. రాత్రి 9 గంటల సమయంలో ఊపిరి ఆడక ఇబ్బంది పడుతుండటంతో కుటుంబసభ్యులు వర్ధన్నపేట ఏరియా వైద్యశాలకు తరలించారు.
అక్కడ డ్యూటీలో ఉండాల్సిన వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో మల్లయ్యకు సరైన సమయంలో వైద్యం అందలేదు. గంటపాటు వైద్యశాలలోనే మల్లయ్య తీవ్రఇబ్బందికి గురయ్యారు. గంట తర్వాత ఓ వైద్యుడు వచ్చి పరిశీలించి మల్లయ్య మృతి చెందినట్టు చెప్పాడు. వైద్యులు అందుబాటులో ఉండి సకాలంలో వైద్యం అందిస్తే మల్లయ్య బతికేవాడని కుటుంబసభ్యులు దవాఖాన ఎదుట ఆందోళన చేపట్టారు. దవాఖానలో 35 మంది వైద్యులు విధులు నిర్వర్తిస్తుండగా, ఎవరూ కూడా రోగులకు అందుబాటులో ఉండటంలేదనే ఆరోపణలు ఉన్నాయి.