సారంగాపూర్, నవంబర్ 9: గుప్తనిధుల వేట కోసం వచ్చిన ముగ్గురు వ్యక్తులు గుంతను తవ్వి పైకి ఎక్కుతుండగా.. ప్రమాదవశాత్తు విద్యుత్తుషాక్‌తో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కండ్లపల్లిలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. కండ్లపల్లికి చెందిన శ్రీరాముల నవత-మల్లేశ్ దంపతులు. మల్లేశ్ ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లాడు. మల్లేశ్ ఇంట్లో గుప్తనిధులు ఉన్నట్టు కుటుంబ సభ్యులకు అనుమానం. ఈ క్రమంలో జగిత్యాల రూరల్ మండలం అనంతారం గ్రామానికి చెందిన నారవేణి మొగిలి (51), గోవిందుపల్లికి చెందిన కొప్పుల సోమయ్య, ధర్మపురి మండలం దమ్మన్నపేటకు చెందిన బైరవేని రాజు ముగ్గురు కలిసి శనివారం రాత్రి శ్రీరాముల మల్లేశ్ ఇంట్లో ఎనిమిది ఫీట్ల లోతు గుంత తవ్వారు.
అందులో నుంచి బయటకు ఎక్కుతుండగా నారవేణి మొగిలి చేయి కరెంట్బోర్డు ఫ్యూజ్ వైర్‌కు తగలడంతో విద్యుత్తు షాక్‌కు గురయ్యాడు. వెంటనే చికిత్స కోసం అంబులెన్స్‌లో జగిత్యాలకు తరలిస్తుండగా, మార్గమధ్యంలో మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్ పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. మొగిలి భార్య లావణ్య ఆదివారం ఠాణాలో ఫిర్యాదు చేయగా, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు బీర్పూర్ ఎస్సై రాజు తెలిపారు.