హైదరాబాద్ : ఈ నెల 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించనున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని టీఎస్పీఎల్ఆర్బీ స్పష్టం చేసింది. ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్‌కు హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం 503 సెంటర్లను ఏర్పాటు చేశారు. వీటికి అదనంగా మరో 35 పట్టణాల్లోనూ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు నియామక మండలి ప్రకటించింది.
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 33 పరీక్ష కేంద్రాలలో ఎస్సై ఉద్యోగాలకు ప్రిలిమినరీ పరీక్ష జరుగుతుందని నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ(అడ్మిన్) ఎం.రమేష్ తెలిపారు. ఆదివారం జరిగే పరీక్షల నిర్వాహణపై శుక్రవారం జాయింట్ సీపీలు రంగనాథ్, కార్తికేయ, విశ్వప్రసాద్‌లతో కలిసి నగర పోలీస్‌స్టేషన్ ఎస్హెచ్ఓలతో వీడియో కన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుందని, పరీక్ష కేంద్రానికి ఒక గంట ముందే చేరుకోవాలన్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉండదని వివరించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు కోవిడ్ ప్రొటోకాల్ పాటిస్తూ, మాస్క్ తప్పని సరిగ్గా ధరించాలన్నారు.