హైదరాబాద్: నగర శివార్లలోని హిమాయత్‌సాగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారు జామున వేగంగా దూసుకొచ్చిన కారు.. హిమాయత్‌సాగర్ వద్ద ఔటర్ రింగురోడ్డుపై (ORR) ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద దాటికి కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని, యాక్సిడెంట్ జరిగినప్పుడు కారులో యువతి సహా ఆరుగురు ఉన్నారని పోలీసులు చెప్పారు. మద్యం తాగి కారు నడుపుతున్నారని, కారులో మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉన్నది.