భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న ఆరంతస్తుల భవనం కుప్పకూలిన (Building Collapse) ఘటనలో ఓ కార్మికుడు మృతిచెందాడు. శిథిలాల కింద చిక్కుకున్న చల్ల కామేశ్వరరావు అనే వ్యక్తిని సహాయక బృందాలు వెలికితీశాయి. తీవ్రంగా గాయపడి కొనఊపిరితో ఉన్న అతడిని హుటాహుటిన దవాఖానకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతడు మృతిచెందాడని అధికారులు వెల్లడించారు. కామేశ్ కాలు తొంటి దగ్గర నుజ్జునుజ్జు అయిందని, ఎడమ చేయి విరిగిపోయిందని తెలిపారు. శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతున్నదని, ఇంకా ఎంతమంది ఉన్నారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉందని చెప్పారు.
కాగా, శిథిలా నుంచి కామేశ్ ఆర్తనాలు విన్న రెస్క్యూ, ఫైర్ సిబ్బంది.. సుమారు గంటా 45 నిమిషాలు శ్రమించి అతడిని వెలికితీశారు. అయితే అప్పటికే తీవ్రంగా గాయపడిన అతడు మృతిచెందాడు. శిథిలాల కింద మరొకరు ఉన్నట్లు తెలుస్తున్నది.
భద్రాచలం పట్టణంలోని రామాలయం సమీపంలో ఓ పాత భవనంపై శ్రీపతి నేషనల్ సేవా ట్రస్టు పేరిట మరో ఐదంతస్తులు నిర్మిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం కూడా పనులు కొనసాగుతుండగా, భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. శిథిలాల్లో ఎంతమంది చిక్కుకున్నారనే విషయం మాత్రం తేలడం లేదు. మరోవైపు ఇద్దరు మాత్రమే పనుల్లో ఉన్నట్టు భవన యజమాని, అధికారులు చెప్తున్నారు. భద్రాచలానికి చెందిన పడిశాల ఉపేందర్‌రావు, చల్లా కామేశ్‌తో పాటు మరికొందరు పనుల్లో ఉన్నట్టు స్థానికులు తెలిపారు.