హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 28 రాష్ర్టానికి రానున్నారు. ఉదయం నల్సార్ లా యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరై మధ్యాహ్నం రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవ్‌ను ప్రారంభిస్తారని రాష్ట్రపతి నిలయం పేర్కొంది. ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు.
సీపీఎస్ రద్దు చేయాలి
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): సీపీఎస్‌ను రద్దుచేసేందుకు కృషిచేయాలని సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ టీపీసీసీ అధ్యక్షుడు బీ మహేశ్‌కుమార్ గౌడ్‌ను కోరింది. మంగళవారం రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మహేశ్‌కుమార్‌గౌడ్‌తో భేటీ అయ్యింది. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన యూపీఎస్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని నేతలు కోరారు.
ఐసెట్‌లో 90% సీట్లు భర్తీ
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఐసెట్ తుది విడత సీట్లను మంగళవారం కేటాయించారు. ఎంబీఏలో 28,345 సీట్లకు 25,747 సీట్లు భర్తీ కాగా, ఎంసీఏలో 6,966 సీట్లకు 6,905 సీట్లు భర్తీ అయ్యాయి. 99 కాలేజీల్లో వందశాతం సీట్లు నిండినట్టు అధికారులు ప్రకటించారు. ఎంబీఏలో మిగిలిన 2,598 సీట్లల్లో 2,529, ఎంసీఏలోనూ 871 సీట్లల్లో 855 ప్రైవేట్ కాలేజీలవే. 27 వరకు ఫీజు చెల్లించి, 28లోపు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని ప్రవేశాల కమిటీ కన్వీనర్ శ్రీదేవసేన వెల్లడించారు.