జగిత్యాల, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ఒక రోజు తేదీ వేసి రూపొందించిన ప్రొసీడింగ్‌ను, రెండు రోజుల ముందే జారీ చేయడం విస్మయానికి గురిచేస్తున్నది. ఈ నెల 22న డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఒక ప్రొసీడింగ్‌ను జారీ చేసింది. ఆర్సీ నం. 110/ఎస్ఈఆర్.1/2021 పేరిట ఉత్తర్వు వచ్చింది. ఆరు జిల్లాలకు సంబంధించి ప్రస్తుతం పూర్తిస్థాయి జిల్లా విద్యాధికారులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులను ఇతర జిల్లాలకు బదిలీ చేస్తూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనల ప్రకారం సంబంధిత శాఖ అధికారులు ప్రొసీడింగ్స్ తయారు చేసిన తదుపరి ఉన్నతాధికారుల ఆమోదం పొందిన తేదీతో ఉత్తర్వులను జారీ చేస్తారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ జారీ చేసిన ప్రొసీడింగ్‌లో 22వ తేదీకి బదులుగా 24 అని వేసి ఉండడం విస్మయానికి గురి చేస్తున్నది. ప్రొసీడింగ్స్‌ను 22 జారీ చేసి, పత్రికల్లో ప్రకటనలు జారీ చేసిన అధికారులు, ప్రొసీడింగ్‌లో మాత్రం 24వ తేదీ వేయడం అందులోను ఆదివారం కావడం ఆశ్చర్య పరుస్తున్నది. ఈ నెల 20న ఒక జిల్లాలోని పాఠశాలలో జరిగిన ఘటన నేపథ్యంలో 21వ తేదీన అధికారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు సమాచారం. సస్పెండ్ అయిన అధికారికి 22న రాత్రి జారీ చేసిన ప్రొసీడింగ్స్‌లో పోస్టింగ్ ఇస్తున్నట్టు ప్రకటించారు. సదరు అధికారి సస్పెన్షన్‌ను రీవోక్ చేయకుండానే ఆఘమేఘాలపై అతడికి పోస్టింగ్ ఏర్పాటు చేసిన అధికారులు, సస్పెన్షన్ రివోక్ కోసం ముందస్తు తేదీతో ఉత్తర్వులు జారీ చేసి ఉంటారనే అధికారులు అభిప్రాయపడుతున్నారు.