అంతలోనే కాదు కాదు!
ఏపీలో కొవిడ్ కొత్త వేరియంట్ కలకలం
ఐర్లాండ్ నుంచి వచ్చిన యువకుడికి నిర్ధారణ
తాజా పరీక్షలో మళ్లీ నెగెటివ్ రిపోర్టు
హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్‌లో ఒమిక్రాన్ కేసు కలకలం రేపింది. ఐర్లాండ్ నుంచి వచ్చిన 34 ఏళ్ల యువకుడికి జరిపిన పరీక్షలో తొలుత ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయ్యింది. ముంబై ఎయిర్‌పోర్టులో జరిపిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగిటివ్ రిపోర్టు రావడంతో ఆ యువకుడు నవంబర్ 27న విశాఖకు చేరుకొన్నాడు. అతనికి విశాఖలో మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయడంతో కొవిడ్ పాజిటివ్ రిపోర్టు వచ్చింది. ఆ వెంటనే హైదరాబాద్ సీసీఎంబీలో జినోమ్ సీక్వెన్సింగ్ చేయడంతో ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడినట్టు తేలింది. కానీ శనివారం జరిపిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగెటివ్ రిపోర్టు వచ్చిందని, ఆ యువకుడికి ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేవని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతంలో ఏపీలో ఒమిక్రాన్ కేసులేమీ లేవని చెప్పారు. ఇటీవల విదేశాల నుంచి ఏపీకి వచ్చిన 15 మందికి కొవిడ్ పాజిటివ్ వచ్చిందని, వీరి శాంపిల్స్‌ను జినోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా.. 10 మందిలో ఒకరికి మాత్రమే ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయిందని తెలిపారు. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావద్దని, సామాజిక దూరాన్ని పాటిస్తూ ఎప్పుడూ మాస్కులను ధరించడంతోపాటు చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని ఏపీ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ హైమావతి సూచించారు.
అవన్నీ వదంతులే..
తిరుపతి పెద్దకాపు వీధిలో ఒమిక్రాన్ కేసు నమోదైనట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, అవన్నీ వదంతులేనని తిరుపతి డీఎంహెచ్‌వో శ్రీహరి స్పష్టం చేశారు. అది కేవలం కరోనా పాజిటివ్ కేసు మాత్రమేనని, ఆ వ్యక్తి నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్‌కు పం పామని తెలిపారు. ఆ వ్యక్తి ఇంకా ఒమిక్రాన్ నిర్ధారణ కాలేదని, ప్రజలు ఆందోళన చెందవద్దని చెప్పారు.