కుత్బుల్లాపూర్, డిసెంబర్ 6: భాగ్యనగరం.. వెలుగుజిలుగుల విశ్వనగరం. కానీ ఆ అద్భుతమైన వెలుగుల అంచుల్లోని చీకట్లలో మగ్గుతున్న విషాద జీవితాలెన్నో! ఆకాశహర్మ్యాలకు ఆమడదూరంలో అత్యంత దుర్భరమైన జీవితాలను వెళ్లదీస్తున్న దీనులెందరో! నగర జీవితంలో నా అనే వారు ఎవరూ లేకపోతే… ‘ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక!’ అన్నట్టుగా మహానగరంలో ఎవరికి ఎవరూ ఏమీకారు… ఎవరిని ఎవరూ ఆదుకోరు. ఉరుకుల పరుగుల జీవితంలో.. ఇరుగుపొరుగు ఇండ్లల్లో ఏం జరిగిందో.. ఎవరు ఎందుకు ఏడుస్తున్నారో కూడా తెలుసుకోరు. ఇలాంటి ఓ హృదయవిదారకమైన ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా షాపూర్‌నగర్‌లో చోటుచేసుకున్నది.
వివరాల్లోకి వెళ్తే మహబూబాబాద్‌కు చెందిన స్వామిదాస్… భార్య, ఇద్దరు కూతుళ్లలో కొంతకాలంగా షాపూర్‌నగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉన్నాడు. కూలి పని చేస్తూ.. కుటుంబాన్ని పోషించిన 76 ఏండ్ల స్వామిదాస్.. అనారోగ్యంతో నవంబర్ 27న కన్నుమూశాడు. వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్న భార్య, మానసికంగా సమస్యలు ఎదుర్కొంటున్న ఇద్దరు కూతుళ్లకు ఏం చేయాలో అంతుపట్టలేదు. అయోమయ పరిస్థితిలో ఎవరికీ చెప్పుకోలేకపోయారు. వీరి రోదనలను కూడా ఇరుగుపొరుగు పట్టించుకోలేదు. నవంబర్ 30 వరకు స్వామిదాస్ మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకుని ఉన్నారు. 30న ఇంటి ఓనర్ గమనించి, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. జీడిమెట్ల పోలీసులు వచ్చి స్వామిదాస్ మృతదేహాన్ని గాంధీ దవాఖాన మార్చురీకి తరలించారు. ఈ నెల 1న సత్యహరిశ్చంద్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యుల సమక్షంలో స్వా మిదాస్ అంత్యక్రియలు నిర్వహించారు.
స్వామిదాస్ అంత్యక్రియలను పోలీసులు దగ్గరుండి జరిపించారు. ఆ తర్వాత స్వామిదాస్ కుటుంబ సభ్యులను వారి ఇంటికి తరలించారు. కానీ ఆ తర్వాత కూడా స్వామిదాస్ కుటుంబ సభ్యులు షాక్ నుంచి తేరుకోలేదు. ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాలేదు. కనీసం భోజనం చేస్తున్నారో లేదో కూడా తెలియదు. ఇలాంటి దుర్భరమైన పరిస్థితిలో.. దుఃఖంలో మునిగిపోయిన కుటుంబం గురించి స్థానికుల ద్వారా తెలుసుకున్న జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేశం వారిని హోం ఫర్ డిజేబుల్ హౌస్‌కు తరలించారు. అక్కడ వైద్య సేవలను అందించేలా చర్యలు తీసుకున్నారు. ఆ కుటుంబానికి అండగా నిలిచారు. సాటి మనుషులు ఆపదలో ఉన్నారంటే ఆదుకునే వాళ్లు దైవంతో సమానం అంటారు. ఇప్పుడు జీడిమెట్ల పోలీసులు సకాలంలో స్పందించి, దుర్భర పరిస్థితిలో చిక్కుకున్న కుటుంబాన్ని ఆదుకోవడం పట్ల స్థానికులు అభినందిస్తున్నారు. విధినిర్వహణ చేస్తూనే మానవత్వం చూపారంటూ ప్రశంసించారు.