Driving Licence | హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో డ్రైవింగ్ లైసెన్సులను కొంత కాలంపాటు రవాణా శాఖ కార్యాలయాల్లోనే జారీ చేయనున్నారు. డ్రైవింగ్ లైసెన్సుల జారీ ని సరళతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వ కొత్త మార్గదర్శకాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడమే ఇందుకు కారణం. దీంతో వాహనదారులు పాత పద్ధతిలోనే తొలుత లెర్నర్ లైసెన్సు కోసం స్లాట్ బుక్‌చేసుకొని, సంబంధిత ఆర్టీఏ కార్యాలయంలో రాత పరీక్షకు హాజరు కావా ల్సి ఉంటుంది. ఆ తర్వాత నిర్ణీత గడువులోగా డ్రైవింగ్ టెస్టులో పాల్గొని పాసైతేనే శాశ్వత లైసెన్సు లభిస్తుంది.
కేంద్ర మార్గదర్శకాల ప్రకారమైతే..
డ్రైవింగ్ లైసెన్సు కోసం ఆర్టీవో కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఆర్టీఏ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రైవేటు డ్రైవింగ్ స్కూళ్లే వాహనదారులకు పరీక్షలు నిర్వహించి ధ్రువపత్రాలను జారీ చేస్తాయి. వాటితో లైసెన్సు కోసం ఆర్టీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. ఆర్టీఏలో రిజిస్ట్రేషన్ చేసుకోని సూళ్లలో డ్రైవింగ్ నేర్చుకున్నవారు మాత్రం పరీక్ష కోసం ఆర్టీఏ కార్యాలయానికి హాజరు కావాల్సిందే.
ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలను నోటిఫై చేయాల్సి ఉంటుంది. కాలుష్యాన్ని తగ్గించేందుకు 9 లక్షల పాత ప్రభుత్వ వాహనాలను దశలవారీగా తొలగిస్తారు. ర్యాష్‌గా డ్రైవింగ్ చేసినవారికి 1,000 నుంచి 2,000 వరకు జరిమానా విధిస్తారు. మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే 25 వేల పెనాల్టీ విధించడంతోపాటు సదరు వాహన యజమాని డ్రైవింగ్ రిజిస్ట్రేషన్ కార్డును రద్దు చేస్తారు. పట్టుబడిన మైనర్‌కు 25 ఏండ్ల వయసు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయరు.