హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ‘ఓజీ’ సినిమా ప్రీమియర్ షో టికెట్లు సామాన్య ప్రేక్షకులకు అందుబాటులో లేకుండా పోయాయి. వాటిని పూర్తిగా బ్లాక్‌లో విక్రయించారని, ఓ నిర్మాత స్వయంగా దగ్గరుండి మరీ ఈ దందా నడిపారని, అభిమానం పేరుతో తమను నిలువునా దోచుకున్నారని పవన్ కల్యాణ్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు.
ప్రీమియర్ షో టికెట్‌ను రూ.800కు మించి అమ్మరాదన్న ప్రభుత్వ ఉత్తర్వును తుంగలో తొకి ఒకో టికెట్‌ను భారీ ధరకు అమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని సుదర్శన్ 35ఎంఎం, దేవి, విశ్వనాథ్, శ్రీరాములు తదితర థియేటర్లలో ఒక్కో టికెట్‌ను ఏకంగా రూ.3-4 వేలకు అమ్ముకున్నారని, తద్వారా రూ.2 వేలకుపైగా మార్జిన్‌తో రాత్రికి రాత్రే కోట్లు సంపాదించారని ధ్వజమెత్తుతున్నారు.