నల్లబెల్లి, ఆగస్టు 10: రైతు రుణమాఫీకి సంబంధించి ఆధార్ మిస్‌మ్యాచ్‌కు కారకులైన ఇద్దరు పీఏసీఎస్ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల పీఏసీఎస్ కార్యాలయంలో డీసీసీ బ్యాంకులో రుణాలు పొందిన రైతుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడంలో అనేక పొరపాట్లు జరిగాయి.
ఒకరి ఆధార్ మరో రైతు బ్యాంకు ఖాతాకు మిస్‌మ్యాచ్ కావడంతో కొంతమంది రైతులు రుణమాపీకి నోచుకోలేదు. దీనిపై ‘నమస్తే తెలంగాణ’ జూలై 30న ‘ఒకరి ఆధార్.. మరొకరికి రుణం’ శీర్షికతో మెయిన్‌లో కథనాన్ని ప్రచురించింది. స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆధార్ మిస్మ్యాచ్పై విచారణ చేపట్టాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది.
ఆధార్ నమోదులో జరిగిన అవకతవకలతో రుణమాఫీకి అనర్హులుగా మారిన రైతులను గుర్తించి సరైన ఆధార్ నంబర్లను నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కోరింది. కలెక్టర్ పీఏసీఎస్ కార్యాలయానికి విచారణ అధికారిగా అసిస్టెంట్ రిజిస్ట్రార్ కీరూనాయక్ను నియమించారు. ఆధార్ మిస్‌మ్యాచ్‌కు పీఏసీఎస్ సీఈవో మొగిలితోపాటు కంప్యూటర్ ఆపరేటర్ వైనాల రాజును కారకులుగా గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపారు. దీంతో సీఈవో, కంప్యూటర్ ఆపరేటర్‌ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆధార్ మిస్‌మ్యాచ్‌కు కారుకులను సస్పెండ్ చేయడం సరే గానీ.. రుణమాఫీ సంగతేంది? ప్రభుత్వం ఆగమేఘాల మీద ఇచ్చిన ఆదేశాలతో ఆధార్ నమోదు ప్రక్రియలో పీఏసీఎస్ సిబ్బంది పొరపాట్లు చేసింది. దీంతో మాకు రుణమాఫీ కాలేదు. బాధ్యులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటే సరిపోదు. నాలాంటి వారికి రుణమాఫీ వర్తించేలా చర్యలు చేపట్టాలి.
-బాధిత రైతు, సమ్మయ్యనాయక్, ముచ్చింపుల తండా