మణుగూరు టౌన్, జూన్ 25 : అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కోలిండియా ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియా జీఎం కార్యాలయం ఎదుట సింగరేణి అధికారులు గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఎంవోఏఐ నాయకులు మాట్లాడుతూ.. వేతన పెంపు, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే చెల్లింపు, పెండింగ్‌లో ఉన్న రెండేండ్ల పీఆర్సీ బకాయిలు, 2017 వేతన సవరణ నష్టాన్ని సవరించి కోలిండియాలో అమలు చేస్తున్న పే అప్గ్రేడేషన్ను సింగరేణిలో అమలు చేయాలని కోరారు.
కొత్తగూడెం సింగరేణి: తమ సమస్యలు పరిష్కరించాలని సింగరేణి సంస్థ లో విధులు నిర్వహిస్తున్న జేఎంఈటీ (జూనియర్ మైనింగ్ ఇంజినీరింగ్ ట్రైనీ) 2016, 2017 బ్యాచ్ ఉద్యోగులు కొత్తగూడెంలోని సింగరేణి హెడ్టాఫీసు ఎదుట గురువారం మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీనియర్ మైనింగ్ సర్దార్లు, ఓవర్మెన్లుగా విధులు నిర్వహిస్తున్న తమ బ్యాచ్‌కు చెందిన ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించకుంటే ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.