తాండూరు : తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవయ్య, ఎస్ఐ సౌజన్య, తాండూర్ పోలీసుల ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని వారసంతలో కొత్తపల్లి సర్పంచ్ ఆకుల వెంకటేష్ అధ్యక్షతన మంగళవారం ‘అరైవ్ అలైవ్’ రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ కుమార్, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, యువత, ఆటో డ్రైవర్లు, యజమానులు, వివిధ సంస్థల ప్రతినిధులు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా తీసుకున్న ముఖ్యమైన చర్యగా పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలతో కుటుంబాలు దెబ్బతింటున్నాయని, ప్రతిరోజూ జరుగుతున్న ప్రమాదాలను గుర్తుపెట్టుకొని ప్రజల్లో భద్రతపై అవగాహన తప్పనిసరిగా పెరగాలని సూచించారు.
మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్‌సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ వంటి నిర్లక్ష్యపు చర్యలే ఈ ప్రమాదాలకు ప్రధాన కారణాలని చెప్పారు. ట్రాఫిక్ నియమాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వర్షాలు, ఎండలు, విపత్తులు.. ఏ పరిస్థితుల్లోనైనా పోలీసులు ప్రజల కోసం అంకిత భావంతో పనిచేస్తున్నారని గుర్తుచేశారు.
పడినచోట ప్రమాదాన్ని చూసిన వెంటనే సహాయం చేసే వారికి పోలీసులు గౌరవం అందిస్తున్నారని, ప్రజా సహకారం రోడ్డు భద్రతలో కీలకమని తెలిపారు.
‘అర్రివ్ అలైవ్’ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి చేరవేసి ప్రమాదరహిత జిల్లాగా నిర్మించేందుకు పోలీసులు కట్టుబడి ఉన్నారని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో, యువతలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడమే కాకుండా, ట్రాఫిక్ నియమాలను పాటించాల్సిన అవసరాన్ని కూడా స్పష్టంగా తెలియజేశారు.
ఈ సదస్సులో గతంలో రోడ్డు ప్రమాదాల్లో తమ కుటుంబసభ్యులను కోల్పోయిన బాధితులు పాల్గొని తమ ఆవేదనను పంచుకున్నారు. తల్లీ, తండ్రి, ఎదిగివచ్చిన కుమారులు, కూతుర్లు, సంపాదించే వ్యక్తిని యాక్సిడెంట్లో కోల్పోయి వారు అనుభవిస్తున్న బాధలు వెల్లడించారు. తమకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదని, రోడ్డుపై వెళ్లేటప్పుడు మీ కోసం ఇంట్లో ఎదురుచూసే భార్యాపిల్లలను గుర్తుకు తెచ్చుకోవాలని వారు కన్నీటి పర్యంతమయ్యారు.
వారి మాటలు సదస్సులో అందరిని ఆలోచింపజేశాయి. ఆ తర్వాత అందరితో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. అలాగే రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఎమ్మెల్యేతోపాటు నాయకులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు ఆర్థిక సాయంగా నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జ్యోత్స్న, ఇంచార్జ్ ఎంపిడివో వేణుగోపాల్ రావు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆటో డ్రైవర్లు, యజమానులు, తదితరులు పాల్గొన్నారు.