Bhatti Vikramarka |హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ) : ఒడిశాలోని నైనీ బ్లాక్ బొగ్గుగని వ్యవహారం రాష్ట్ర మంత్రివర్గంలో పెట్టిన చిచ్చు ఇంకా చల్లారలేదా? టెండర్ నోటిఫికేషన్‌ను సింగరేణి కాలరీస్ రద్దు చేసినా, ప్రభుత్వ పెద్దల మధ్య వైరం మాత్రం పెరుగుతూనే ఉన్నదా? నైనీలోని అవినీతి బొగ్గు మసిని దళిత ఉప ముఖ్యమంత్రికి పూసి, ఆయన్ను మంత్రివర్గం నుంచి సాగనంపేందుకు ముఖ్యనేత పావులు కదుపుతున్నారా? ఆయనకు స్పీకర్ పదవి ఇచ్చి, అదే సామాజికవర్గానికి చెందిన రంగారెడ్డి జిల్లా నేతకు మంత్రి పదవి ఇచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారా? ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు తన కోపం తీరడంతోపాటు దళితవర్గాల నుంచి వ్యతిరేకత రాకుండా, రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం దక్కేలా ముఖ్యనేత ఎత్తు వేశారా? అని ప్రస్తుతం గాంధీభవన్, సచివాలయంలో జరుగుతున్న చర్చ ఇది. దీనికి ప్రభుత్వవర్గాల నుంచి అవును అనే సమాధానమే వినిపిస్తున్నది. పైగా ముఖ్యనేత తన ప్రతిపాదనలను ఢిల్లీ పెద్దలకు వివరించేందుకు ఒక దూతను పంపినట్టు చెప్పుకొంటున్నారు.
ఇటీవల ఐదు రాష్ర్టాల ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో తెలంగాణలో క్యాబినెట్ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించనున్నదని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ క్యాబినెట్లో 18మందికి అవకాశం ఉండగా, ప్రస్తుతం 16 మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. మరో రెండు బెర్తులు రెండున్నరేండ్లుగా ఖాళీగా ఉన్నాయి. తమకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్న ఎమ్మెల్యేలకు ఆ రెండు ఖాళీలను చూపించి చల్లబరుస్తూ వస్తున్నది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ కంటే పునఃవ్యవస్థీకరణ చేయటమే మేలు అని కాంగ్రెస్ అధిష్ఠానం అనుకుంటున్నదట. తన మాట చెల్లుబాటు కావటానికి ఇదే మంచి సమయమని ముఖ్యనేత భావిస్తున్నట్టు సమాచారం. విస్తరణ కాకుండా తన మార్క్ ప్రక్షాళన చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. కేరళలో ముఖ్య పదవి ఆశించి భంగపడ్డ తన మార్గదర్శిని అస్త్రంగా ప్రయోగించి, తాను అనుకున్నది సాధించేలా పావులు కదుపుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే ఆయనకు ఏఐసీసీలో పలుకుబడి ఉండగా, తాజా పరిణామాలతో ఆయనపై జాలి కూడా పెరిగిందని, ఆయన చెప్తే కచ్చితంగా పని అవుతుందని ముఖ్యనేత భావిస్తున్నారట.
2034వరకు తానే సీఎంగా ఉంటానని కలలుగంటున్న ముఖ్యనేతకు అసలు కాంగ్రెస్ నేతలు ప్రధాన అడ్డంకిగా మారినట్టు కాంగ్రెస్ వర్గాల్లో చెప్పుకొంటున్నారు. ప్రధానంగా సీనియర్ మంత్రులు ఆయన మాటలను లెక్కచేయటం లేదని ప్రచారం జరుగుతున్నది. వీళ్లలో కనీసం ఇద్దరు మంత్రులను తప్పించగలితే, తన ఆధిపత్యానికి తిరుగు ఉండదని ముఖ్యనేత భావిస్తున్నారట. మరోవైపు మంత్రి పదవులు ఆశించేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నది. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(మునుగోడు), మల్రెడ్డి రంగారెడ్డి(ఇబ్రహీంపట్నం), పీ రామ్మోహన్‌రెడ్డి(పరిగి), పీ సుదర్శన్‌రెడ్డి(బోధన్), బాలూనాయక్(దేవరకొండ), రాంచందర్‌నాయక్ (డోర్నకల్), ప్రేమ్‌సాగర్‌రావు(మంచిర్యాల), మదన్మోహన్రావు(ఎల్లారెడ్డి), మహేశ్‌కుమార్‌గౌడ్(పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ), గడ్డం ప్రసాద్ కుమార్(స్పీకర్), విజయశాంతి(ఎమ్మెల్సీ) తదితరులు మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నారు.
ఉన్నది రెండే బెర్తులు కాబట్టి ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కనీసం ఇద్దరినైనా బయటకు పంపాలని ముఖ్యనేత ప్రతిపాదించినట్టు తెలిసింది. ఇందుకోసం అవినీతి, శాఖల నిర్వహణలో వైఫల్యముద్ర వేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు సీనియర్ కాంగ్రెస్ నేత, దళిత మంత్రిని టార్గెట్ చేసినట్టు తెలిసింది. నైనీ బొగ్గు గనులపై వచ్చిన ఆరోపణలను అడ్డుపెట్టుకొని మంత్రివర్గం నుంచి తప్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిసింది. సింగరేణి మీద తన బామ్మర్ది ఆధిపత్యాన్ని కట్టడి చేస్తున్నాడనే ఆగ్రహంతోపాటు ఆయన మీద ఇప్పటికే ఉన్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో సులువుగా వేటు వేయించవచ్చని ఆలోచిస్తున్నారట. కాంట్రాక్టు బిల్లుల చెల్లింపుల్లో 20 శాతం కమీషన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు గతంలోనే ఉన్నాయని, అదే డబ్బును సింగరేణి ఆధారిత పనుల్లో పెట్టుబడులు పెడుతున్నారంటూ ఆయనపై పూర్తిస్థాయి విజిలెన్స్ నివేదిక రూపొందించి అధిష్ఠానం ముందు పెట్టినట్టు తెలిసింది. గతంలో సెక్రటేరియట్‌లోని ఆయన చాంబర్ ముందు కాంట్రాక్టర్లు చేసిన ధర్నాలు, ప్రస్తుతం ఆయన చాంబర్ వద్దకు సాధారణ ప్రజలు వెళ్లటానికి వీలులేకుండా ఏర్పాటుచేసిన కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, నైనీ బొగ్గుగని వ్యవహారం, టెండర్ నోటిఫికేషన్ రద్దు చేయటం తదితర వివరాలను నివేదికలో పొందుపరిచినట్టు తెలిసింది. ఆయన్ను తప్పించగలిగితే అసలు కాంగ్రెస్ నేతలను అదుపులో పెట్టవచ్చని ముఖ్యనేత ఆలోచించినట్టు సమాచారం. అంతేకాదు, ఉప ముఖ్యమంత్రికి బదులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో దళిత నేతకు అవకాశం ఇస్తే, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెడ్డికి పదవి ఇచ్చినా అభ్యంతరాలు రావని భావిస్తున్నారట. తనకు అత్యంత ఆప్తునిగా ఉన్న బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పీ సుదర్శన్‌రెడ్డితో రెండో బెర్తు నింపవచ్చని ముఖ్యనేత అనుకుంటున్నట్టు సమాచారం.