గోదావరిఖని, డిసెంబర్ 18: మణుగూరు పీకే ఓసీపీ 2 బ్లాక్‌ను సింగరేణికే కేటాయించాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. బొగ్గు బ్లాక్‌ల వేలానికి వ్యతిరేకంగా కలిసివచ్చే కార్మిక సంఘాలతో టీబీజీకేఎస్ ఐక్య పోరాటాలు చేస్తున్నదని స్పష్టం చేశారు. గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు. వచ్చే నెల 8న జరిగే బొగ్గు బ్లాక్‌ల వేలంలో మణుగూరు పీకే ఓసీపీ- 2 బ్లాక్‌ను అమ్మేందుకు నిర్ణయించారని తెలిపారు.
దీనిని అడ్డుకోవాల్సిన గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. వేలంలో మొత్తం ఏడు సంస్థలు పాల్గొంటున్నాయని, సింగరేణి సంస్థకు ఆ బ్లాక్ దక్కకపోతే పరిస్థితి ఏంటనేది ముందుగానే పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. పోటీ మార్కెట్లో బ్లాక్ దక్కుతుందా.. లేదా..? అనేది ఎవరి చేతిలో ఉండదని, ఈ వేలాన్ని నిర్వహించకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.