Ibrahimpatnam | ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 23: హైదరాబాద్‌కే పరిమితమైన హైడ్రా.. శివారు ప్రాంతాలపైనా దృష్టి సారించింది. సోమవారం హైడ్రా అధికారులు ఇరిగేషన్, పోలీసు, రెవెన్యూ శాఖల ఆఫీసర్లతో కలిసి తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మాసబ్‌చెరువు, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద, చిన్న చెరువులు.. వాటి ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో వెలిసిన అక్రమ నిర్మాణాలను పరిశీలించారు. మాసబ్ చెరువు ఎఫ్టీఎల్ సుమారు 500 ఎకరాలుండగా ప్రస్తుతం అది 300 ఎకరాలకు కుచించుకుపోయింది. ఈ చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు వెలిసినట్టు అధికారులు గుర్తించారు. వాటిపై కొరడా ఝళిపించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో అక్రమ నిర్మాణాలు చేపట్టిన నిర్మాణదారుల్లో భయం పట్టుకున్నది.
చెరువుల మాయంపైనా హైడ్రా కన్ను
నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెరువులనూ చెరపట్టారు. వాటిని ప్లాట్లుగా చేసి విక్రయించారు. దీంతో పలు చెరువులు, కుంటలు మాయమయ్యాయి. కాగా హైడ్రా అధికారులు ఇరిగేషన్ అధికారులతో కలిసి చెరువులు, కుం టలపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఇరిగేషన్ ఆధీనంలో ఎన్ని చెరువులు, కుంటలున్నాయి? వాటిలో ఎన్ని కబ్జాకు గురయ్యాయి? అన్న కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, తుర్కయాంజాల్, పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీల పరి ధిలో అక్రమ నిర్మాణా ల గుర్తింపు పనులను ముమ్మరం చేశారు.