హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): ‘రాజకీయాలకతీతంగా బీసీలంతా ఏకమవ్వాలి.. ఆగస్టు 7న గోవాలో జరిగే ఓబీసీ జాతీయ మహాసభను జయప్రదం చేయాలి’ అని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. ఆదివారం హైదారాబాద్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో మహాసభ పోస్టర్‌ను బీజేపీ, ఎంఐఎం ఎంపీలు ఈటల రాజేందర్, అసదుద్దీన్ ఓవైసీ, వద్దిరాజుతో కలిసి ఆవిష్కరించారు.
వద్దిరాజు మాట్లాడుతూ.. బీసీలకు మంచిరోజులు రానున్నట్టు ఆశాభావం వ్యక్తంచేశారు. బలహీనవర్గాలను చైతన్యం చేస్తున్న బీసీ సంఘాల నేతలను అభినందించారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. జనాభా ప్రకారం రిజర్వేషన్లు సాధించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు.