
జమ్మికుంట : ఒక నేత రెండు సార్లు మంత్రిగా పనిచేశాడంటే ఆ నియోజకవర్గం ఎలా ఉండాలి? అక్కడి పట్టణాలు ఎలా కనిపించాలి? ఇక పేరుగాంచిన ఆలయాలు ఇంకెంత వెలుగొందాలి? కానీ, హుజూరాబాద్ నియోజకవర్గంలో చూస్తే పరిస్థితి భిన్నంగా ఉన్నది. పట్టణాలు, పల్లెలే కాదు.. భక్తుల కొంగుబంగారంగా నిలిచే ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి ఆలయంపైనా చిన్నచూపే. ఈటల రాజేందర్ ఏకంగా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినా కనీసం ఆలయాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు.
ఆయనకు దేవాలయాలంటే పడదు. పైగా లెఫ్టిస్ట్ అంటడు. కొబ్బరికాయ చేతికిస్తే ఎటో చూస్తడు. బొట్టుకు ససేమిరా అంటడు. ఇప్పుడు మాత్రం లెఫ్ట్ నుంచి రైటుకు పోయి వేదాలు వల్లిస్తున్నడు. గుడి విస్తరణ, భక్తుల కోసం ప్రత్యేకంగా 100 గదులు, పుష్కరిణికి రోడ్డు ఇలా.. ఎన్నో పనుల అభివృద్ధిని కోరుతూ అర్చకులతోపాటు ఎందరో విన్నపాలు చేశారు. అయినా ఏనాడూ ఈటల వినిపించుకోలేదు.
ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి కానరాదు. ఒక్క మాటలో చెప్పాలంటే భక్తులు స్నానం చేసే పుష్కరిణికి రోడ్డే లేదు. దిగి స్నానం చేసే అవకాశమే లేదు. ఆయన తెచ్చిన సుమారు రూ.70 లక్షల నిధులతో షెడ్ల నిర్మాణం పూర్తి చేయించారు. ఇదొక్కటి తప్పా.. ఇక మిగితా అభివృద్ధంతా భక్తులు, దాతలు అందించిన సహకారంతోనే జరిగింది. ప్రముఖ కంపెనీకి చెందిన భాగస్వాములు అందించిన రూ.2-3కోట్లతోనే (స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం) పనులు చేశారు.

వారిచ్చిన విరాళంతో గుడి చుట్టూ సాలారం, మూడు రాజ గోపురాలు, కల్యాణ మండపం, ఎదుర్కోళ్ల మండపం, బేతాళ స్వామి గుడి, షెడ్ల కింద మార్బుల్ని అందించి కట్టించారని స్థానికులు చెప్పారు. ఇక్కడ ఈటల అభివృద్ధి చేయనేలేదు.
పైసల మంత్రిగా ఉన్నా పట్టలే..
ఏటా బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి. అందులో శ్రీరామనవమి వేడుకలు.. రాములోరి కల్యాణం మరింత కమనీయంగా సాగుతుంది. భారీసంఖ్యలో వచ్చే భక్తుల కోసం జమ్మికుంట వ్యాపారులు తలా రూ.20వేలకు పైగా చందాలు వేసుకుని అన్నదానం చేస్తున్నారు. చేస్తూనే ఉన్నారు. సదరు వేడుకలు వేసవిలో రావడం వల్ల భక్తుల కోసం ఓ దాత చల్లా ట్యాంకర్లను అందిస్తున్నారు. ఈటల మాత్రం సమయానికి మంత్రి హోదాలో రావడం.. తలపాగతో తలంబ్రాలు అందించి వెళ్లిపోతారని స్థానికులు అంటున్నారు. ఆయన రెండుసార్లు చేసిన మంత్రి పదవుల్లో ఒకటి అల్లాటప్పా మంత్రి పదవి కాదు.. ఆర్థిక మంత్రిగా పదవి. అంటే అందరికీ పైసలిచ్చే పదవి. అలాంటి కీలక పదవిలో ఉండి కూడా సీతారామచంద్రస్వామిని ఈటల ఏనాడూ పట్టించుకోలేదు. అభివృద్ధి చేసేందుకు చేతులూ రాలేదు. ఎందుకో ఆయనకే తెలియాలి.