హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తేతెలంగాణ): ఓ వైపు గోదావరిలో మిగులు జలాలే లేవని సీడబ్ల్యూసీ, ఎన్‌డబ్ల్యూడీఏ తేల్చిచెబుతున్నాయి. మరోవైపు ఛత్తీస్‌గఢ్ వినియోగించుకోని 148 టీఎంసీల జలాలనే తరలించేలా గోదావరి కావేరి (జీసీ) లింక్ ప్రాజెక్టును రూపొందించారు. తన వాటా జలాల మళ్లింపునకు ఛత్తీస్‌గఢ్ ససేమిరా అంటున్నది. ఇప్పుడు కొత్తగా మిగులు జలాలు ఉన్నాయంటూ పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ఏపీ దూకుడుగా ముందుకు సాగుతున్నది. మొత్తంగా గోదావరిలో నీటిలభ్యతపై స్పష్టత కరువైంది. జీసీ లింక్‌పై పూర్తిగా సందిగ్ధత నెలకొన్నది. అనేక సాంకేతిక అంశాలపై బేసిన్ పరిధిలోని అన్ని రాష్ర్టాలు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం అన్ని రాష్ర్టాలతో ఎన్‌డబ్ల్యూడీఏ (నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ) కన్సల్టేషన్ మీటింగ్‌ను నిర్వహించనుండటం ఆసక్తిగా మారింది.
బచావత్ ట్రిబ్యునల్ పూర్వ మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఏపీ, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ర్టాలు చేసుకు న్న అంతర్రాష్ట్ర ఒప్పందాలనే ‘ట్రిబ్యునల్ అవార్డు’ గా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 75శాతం డిపెండబులిటీ అంటే కనీసం 4 ఏండ్లలో 3ఏండ్లపాటు నీటిలభ్యత ఉండటంతోపాటు, ఆయకట్టు రైతులకు విజయవంతంగా నీరందించగలిగేలా ఉండాలి. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) లెక్కల ప్రకారం గోదావరి బేసిన్లో 75 శాతం డిపెండబులిటీ ఆధారంగా సర్ప్లస్ వాటర్ ల భ్యత లేనేలేదు. 75 శాతం డిపెండబులిటీ ప్రకారం గోదావరిలో 3396.9 టీఎంసీల ప్రవాహాలు ఉండ గా, సగటు ప్రవాహాలు 4535.1 టీఎంసీలు. 75 శాతం కంటేపైగా ఉండే సగటు నీళ్లు కేవలం 1138.2 టీఎంసీలు మాత్రమే. ఇవి కూడా ట్రిబ్యునల్ కేటాయించిన మేరకు జలాలను ఎగువ రాష్ర్టా లు వినియోగించుకోకపోవడం వల్ల, ఆ మేరకు నీటి నిల్వ సామర్థ్యాలను పెంచుకోకపోవడం వల్లనే దిగువకు వెళ్తున్నాయి.
ఆ విధంగా ఛత్తీస్‌గఢ్ దాదాపు 400 టీఎంసీలను, తెలంగాణ సైతం కాళేశ్వరం, సమ్మక్కసాగర్, సీతమ్మసాగర్, దేవాదుల తదితర ప్రాజెక్టులకు కేటాయించిన దాదాపు 400టీఎంసీల జలాలను పూర్తిగా వినియోగించుకోవడం లేదు. మహారాష్ట్ర, ఒడిశా సైతం కేటాయింపుల మేరకు జలాలను వినియోగించుకోవడం లేదు. బేసిన్ రాష్ర్టాలన్నీ నికర కేటాయింపుల మేరకు జలాలను వినియోగించుకుంటే 75శాతం డిపెండబులిటీ కింద దిగువన గోదావరిలో మిగులు జలాలన్నవే ఉండబోవు. ఇదే విషయాన్ని సీడబ్ల్యూసీ, ఎన్‌డబ్ల్యూడీఏ గతంలోనే అధ్యయనం చేసి చెప్పాయి. కేంద్రం మాత్రం జాతీయ దృక్పథంతో గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.
ఛత్తీస్‌గఢ్ తన వాటాలో వినియోగించుకోని 148 టీఎంసీల జలాలను కావేరికి తరలిస్తామని ప్రతిపాదనలు చేసింది. అంతవరకుబాగానే ఉన్నా ఇప్పటివరకు ఆ రాష్ట్రం నుంచి కేంద్రం ఎలాంటి అంగీకారం తీసుకోలేదు. ఇదిలావుంటే ఛత్తీస్‌గఢ్ సైతం తన వాటా జలాల మళ్లింపును వ్యతిరేకిస్తున్నది. వాటా జలాల వినియోగానికి ప్రాజెక్టుల కోసం ప్రతిపాదన లు చేస్తున్నది. ఈ విషయాన్ని కేంద్రానికి సైతం ఇటీవలే తెలియజేసింది. దీంతో ప్రస్తుతం జీసీ లింక్ ప్రాజెక్టు సందిగ్ధంగా మారింది.
ఇదిలావుంటే కేంద్ర సంస్థల వాదనలకు భిన్నంగా గోదావరిలో మిగులు ఉన్నదంటూ చెబుతూ ఏపీ పోలవరం బనకచర్ల ప్రాజెక్టును తెరమీదకు తీసుకువచ్చింది. గోదావరిలో మిగులు జలాలే లేవని, జీసీ లింక్ ప్రాజెక్టు చేపడితే పోలవరానికి నీటిలభ్యత ఉండబోదని అభ్యంతరాలు వ్యక్తంచేసిన ఏపీనే ఇప్పుడు పీబీ లింక్‌ను చేపట్టడం కొసమెరుపు. గోదావరి నదిలో నీటి లభ్యతపై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా కేంద్రం పట్టించుకున్న దాఖలాలేదు.
గోదావరిలో నీటి లభ్య త ఎంత ఉంది? ట్రిబ్యునల్ ఆయా రాష్ర్టాలకు ఇప్పటికే చేసిన నీటి కేటాయింపులను మినహాయించగా అందుబాటులో ఉండే అదనపు జలాలు ఎన్ని? వాటిని వినియోగించుకోవచ్చా? లేదా? అన్నదానిపై స్పష్టతనివ్వాలని, ఆ తరువాతే నదుల అనుసంధానంపై దృష్టి సారించాలని రాష్ర్టాలు చేస్తున్న డిమాండ్లను పెడచెవిన పెడుతున్నది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం తన వాటా జలాలను వినియోగించుకుంటే జీసీ లింక్ భవిష్యత్ ఏమిటని గత టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశంలో నిపుణులు సైతం ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో జీసీ లింక్‌పై రాష్ర్టాలతో కన్సల్టెన్సీ మీటింగ్‌లో కూలంకషంగా చర్చించాలని నిర్ణయించారు.
జీసీ లింక్ ప్రాజెక్టుపై శుక్రవారం బేసిన్‌లోని అన్ని రాష్ర్టాలతో 6వ కన్సల్టెంట్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎన్‌డబ్ల్యూడీఏ ఇప్పటికే అన్ని రాష్ర్టాలకు సమాచారమిచ్చింది. ప్రాజెక్టుపై రాష్ర్టాలు లేవనెత్తుతున్న సాంకేతిక అంశాలపై చర్చించనున్నది. ఈ భేటీలో బేసిన్‌లోని తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి తదితర రాష్ర్టాలు పాల్గొననున్నాయి. ఇప్పటికే 5సార్లు కన్సల్టేషన్ సమావేశాలను నిర్వహించినా ఏకాభిప్రాయం కుదరలేదు.
హైదరాబాద్, ఆగస్టు21 (నమస్తే తెలంగాణ ): ప్రధాని మోదీ నేతృత్వంలో నిర్వహించనున్న ప్రగతి సమావేశ ఎజెండా నుంచి పొలవరం ప్రాజెక్టు అంశాన్ని మరోసారి తొలగించారు. అంతేకాదు 27న నిర్వహించాలని నిర్ణయించిన సమావేశాన్ని శుక్రవారం మధ్యా హ్నం 3గంటలకే ఏర్పాటు చేస్తూ రీ షెడ్యూల్ చేశారు. ఈ మేరకు రాష్ర్ర్టాలకు కేంద్రం సమాచారం అందించింది. పోలవరం ప్రాజెక్టు ముంపుతోపాటు, పునరావాసం తదితర అం శాలపై తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాలు అభ్యంతరాలను వ్యక్తంచేస్తున్నాయి.
ఆయా అంశాలపై ప్రధాని మోదీ ఆధ్వర్యంలో గత మే 28న నిర్వహించిన ప్రగతి సమావేశం లో చర్చించాలని నిర్ణయించారు. ఎజెండాను చేర్చారు. ఆ తరువాత జూన్ 25వ తేదీకి వాయిదా వేశారు. అప్పుడు కూడా చివరి నిమిషంలో ఎజెండా అంశాల్లోంచి రెండోసారి సైతం తొలగించారు. తాజాగా ఈనెల 27వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఇప్పుడు కూడా మళ్లీ తొలగించారు.
హైదరాబాద్, ఆగస్టు 21(నమస్తే తెలంగాణ): ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్‌కి చెందిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల వల్ల ఏపీకి ఎలాంటి ప్రయోజనం ఉండదని, అది రాష్ర్టానికి ఆర్థిక భారంగా మారుతుందన్నారు. చంద్రబాబుకు పేరు రావాలనే ఉద్దేశంతోనే బనకచర్ల ప్రాజెక్టు చేపడుతున్నారన్నారు.
రాయలసీమకు రూ.3వేల కోట్లతో రాజోలు నుంచి నీళ్లిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని, దీనికి డబ్బులు లేనప్పుడు రూ.80వేల కోట్లతో బనకచర్లను ఎలా పూర్తి చేస్తారని డీఎల్ రవీంద్రరెడ్డి ప్రశ్నించారు. ఏపీలో కనీసం పారసిటమాల్ మాత్రలు కూడా పంపిణీ చేసే పరిస్థితి లేదని విమర్శించారు. దీనిపై ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన లేదని రవీంద్రరెడ్డి విమర్శించారు.