హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): తల్లిగర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డ భూమ్మిదికి వచ్చే దశల్లో కేసీఆర్ న్యూట్రిషియన్ కిట్‌తోపాటు, ఆ బిడ్డ అంగన్వాడీ కేంద్రాలకు చేరగానే సన్నబియ్యంతో పౌష్టిక ఆహారాన్ని అందించాలని రాష్ట్రప్రభుత్వం సంకల్పించింది. ఒకవైపు న్యూట్రిషియన్ కిట్స్, మరోవైపు రాష్ట్రంలోని 35,700 అంగన్వాడీ కేంద్రాలకు ఆరోగ్యలక్ష్మి పథకం కింద పౌష్టికాహారాన్ని అందించాలని కొత్త సచివాలయం ప్రారంభోత్సవం సాక్షిగా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సంబంధితశాఖల మంత్రులు వీటిపై సంతకాలు చేశారు.
రాష్ట్రమంతటా న్యూట్రిషియన్ కిట్స్
రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కార్యక్రమాన్ని విస్తరించి, అమలు చేసేందుకు తెలంగాణ సరారు సిద్ధమైంది. రక్తహీనత అధికంగా ఉన్న తొమ్మిది జిల్లాల్లో ప్రభుత్వం ఇప్పటికే న్యూట్రిషన్ కిట్ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాలో 6.84 లక్షల మంది గర్భిణులకు 1046 కేంద్రాల ద్వారా మొత్తంగా 13.08 లక్షల కిట్స్ పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఒకో కిట్ విలువ రూ.2 వేలు.
రక్తహీనతను అధిగమించేందుకు
రక్తహీనత గర్బిణుల పాలిట శాపంగా మారుతున్నది. ప్రసవాలు సంక్లిష్టమవుతున్నాయి. ఎనీమియా నివారించడం వల్ల మాతృ మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. మాతా శిశు సంరక్షణ కోసం ఇప్పటికే అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మాతృ మరణాలు తగ్గించటంలో గొప్ప వృద్ధిని నమోదు చేసింది.
బిడ్డకు కేసీఆర్ కిట్.. తల్లికి న్యూట్రిషన్కిట్
మాతా శిశు సంరక్షణకు పెద్దపీట వేస్తూ సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా మరో విప్లవాత్మకమైన పథకానికి శ్రీకారం చుట్టారు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ ఇప్పటికే 9 జిల్లాల్లో అమలవుతుండగా, అన్ని జిల్లాల్లో పంపిణీ చేయనున్నాం. గర్భిణిగా ఉన్నపుడు న్యూట్రిషన్ కిట్, బాలింతగా ఉన్నపుడు కేసీఆర్‌కిట్ లబ్ధిదారులకు వరంగా మారింది. మాతృమరణాలు తగ్గించటంలో దేశంలోనే మనం మూడో స్థానంలో నిలిచాం. ఈ సంఖ్యను మరింత తగ్గించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ పథకానికి రూపకల్పన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.
– వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌లో ఉండేవి