సిటీబ్యూరో, జూన్ 16 (నమస్తే తెలంగాణ): మాతా శిశు సంరక్షణలో భాగంగా సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు ప్రవేశపెట్టిన న్యూట్రిషన్ కిట్ పంపిణీ నగరంలో ప్రారంభమైంది. ఈనెల 14న నిమ్స్ వేదికగా సీఎం కేసీఆర్ ఈ న్యూట్రిషన్ కిట్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజు నుంచి హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా న్యూట్రిషన్ కిట్స్ పంపిణీని ప్రారంభించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జె.వెంకటి తెలిపారు. నగర వ్యాప్తంగా న్యూట్రిషన్ కిట్‌కు అర్హులైన 5016 మంది గర్భిణులను అధికారులు గుర్తించారు. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడే గర్భిణులకు ఈ న్యూట్రిషన్ కిట్ వరమని, ఈ కిట్‌ను నగర పరిధిలోని అన్ని ప్రసూతి కేంద్రాలు, పీహెచ్సీలలో పంపిణీ చేస్తున్నారు.
రెండు దఫాలుగా కిట్స్ పంపిణీ..
ప్రతి గర్భిణికి రెండు దఫాలుగా ఈ న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ చేయనున్నారు. గర్భం దాల్చిన 4వ నెలలో మొదటి కిట్, 7వ నెలలో 2వ కిట్‌ను అందజేస్తారు. గర్భిణులు న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటే వారి ఆరోగ్యంతో పాటు కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యవంతంగా ఎదుగుతాడు.
న్యూట్రిషన్ కిట్ వల్ల కలిగే లాభాలు..
న్యూట్రిషన్ కిట్ వల్ల తల్లీబిడ్డకు ఎంతో మేలు కలుగుతుందని వైద్యనిపుణులు పేర్కొన్నారు. ఈ కిట్‌లోని నెయ్యి, కర్జూర పండ్లు, హార్లిక్స్ ప్రొటీన్ మిల్క్ పౌడర్, బెల్లం పట్టీలు, టానిక్‌లు తదితర బలవర్ధక పదార్థాలతో తల్లి రక్తహీనత తగ్గి, సుఖ ప్రసవం జరగడానికి ఉపయోగపడతాయని, అంతేకాకుండా పుట్టబోయే బిడ్డ కూడా పూర్తి ఆరోగ్యంగా ఉంటాడని వైద్యులు చెబుతున్నారు.
రెండు రోజుల్లో 108 మందికి…
న్యూట్రిషన్ కిట్ పంపిణీ ప్రారంభమైన రెండు రోజుల్లోనే 108మంది గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్‌ను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. నగర వ్యాప్తంగా ఇప్పటి వరకు గర్భిణులను గుర్తించగా వారిలో నాలుగో నెల, ఏడు నెలల గర్భవతులు 5016 మంది ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. 4వ నెలలో ప్రతి గర్భిణికి మొదటి న్యూట్రిషన్ కిట్, 7వ నెలలో రెండో కిట్ అందజేయనున్నారు.
రక్తహీనత, విటమిన్ లోపానికి కిట్‌తో చెక్…
కడుపులో బిడ్డ పడగానే న్యూట్రిషన్ కిట్, కడుపులో నుంచి బిడ్డ బయటకు రాగానే కేసీఆర్ కిట్ అందిస్తున్నాం. ఈ రెండు కిట్స్ కూడా తల్లీబిడ్డల ఆరోగ్యానికి ఉపయోగపడేవే. ముఖ్యంగా న్యూట్రిషన్ కిట్‌తో గర్భవతుల్లో ఉన్న రక్తహీనత, విటమిన్ లోపం తదితర సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కేసీఆర్ కిట్ పొందే ప్రతి గర్భిణికి ఈ న్యూట్రిషన్ కిట్స్ అందజేస్తాం. ఈ కిట్స్ వల్ల తల్లీ బిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉంటారు. నగరంలో ఇప్పటి వరకు 5016 మంది గర్భిణులను న్యూట్రిషన్ కిట్స్ కోసం గుర్తించాం. ఈ కిట్స్ పంపిణీని మరింత వేగవంతం చేస్తాం. ఇందుకోసం నగరంలోని ప్రసూతి సేవలందించే అన్ని ఆరోగ్య కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తాం.
– డా.వెంకటి, హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి