హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): కంటిన్యూ నర్సింగ్ ఎడ్యుకేషన్ (సీఎన్ఈ) కారణంగా రాష్ట్రవ్యాప్తంగా నర్సులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ ఫ్లోరెన్స్ నర్సెస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నక్క సూర్యకుమార్ వాపోయారు. క్రెడిట్ ఆధారిత రెన్యువల్‌కు 6 నెలల గడువు పొడిగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కోఠిలోని హెల్త్ క్యాంపస్‌లో నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్ విద్యాలతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సులకు సబ్జెక్టుపై పూర్తి అవగాహన కోసం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని వెల్లడించారు. నర్సులు ఐదేండ్లలో 150 గంటలు ఈ ప్రొగ్రామ్‌లో పాల్గొనాలని నిబంధన ఉన్నదని తెలిపారు. క్లాసులు వినకపోతే రిజిస్ట్రేషన్ రెన్యువల్ కాదని, తద్వారా డ్యూటీ అన్‌ఫిట్ అవుతారని వివరించారు. కార్యక్రమంలో ది నర్సింగ్ వరల్డ్ ప్రతినిధి సురేశ్, స్వర్ణలత, శ్రీలత, సాయి ప్రియాంక, జ్యోతి, అనిత, పూజిత, లక్ష్మి, మంజుల పాల్గొన్నారు.