హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ)/సుల్తాన్ బజార్: డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్) విభాగంలో నర్సింగ్ ఆఫీసర్ల బదిలీల రచ్చ శనివారం కూడా కొనసాగింది. కోఠిలో శుక్రవారం అర్ధరాత్రి వరకు నిరసన తెలిపిన నర్సులు.. శనివారం డీపీహెచ్ కార్యాలయాన్ని ముట్టడించారు. పారదర్శకంగా సీనియార్టీ జాబితా ప్రకటించాలని, వేకెన్సీ జాబితాను ప్రదర్శించి, ఆఫ్‌లైన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించాలని, ఆప్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ.లక్షలు తీసుకొని, సీనియార్టీ జాబితా నుంచి పేర్లను మాయం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ముందుగా హెడ్ నర్సుల పదోన్నతులు చేపట్టాలని, ఆ తర్వాతే బదిలీలు మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు కొందరు నర్సింగ్ ప్రతినిధులను కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్వీ కర్ణణ్ వద్దకు తీసుకెళ్లారు. పదోన్నతులు చేపట్టడం కుదరదని, బదిలీలను ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తామని, సీనియార్టీ లిస్ట్‌ను మరోసారి సమీక్షించి, సాయంత్రానికి వెబ్సైట్లో పొందుపరుస్తామని ఆయన హామీ ఇచ్చారు.
మరోవైపు మధ్యాహ్నం మూడు గంటల వరకు వేచిఉన్నా డీపీహెచ్ డాక్టర్ రవీంద్రనాయక్ తన కార్యాలయానికి రాకపోవడంతో స్టాఫ్ నర్సులు కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీకి చేరుకొని.. ఓఎంసీ అకడమిక్ బ్లాక్ వద్ద నిరసన తెలిపారు. దీంతో డీపీహెచ్ అక్కడికి చేరుకున్నారు. ఉదయం నుంచి తాము ఆయన కోసం ఎదురుచూస్తే ‘త్వరలో కమ్యూనికేట్ చేస్తాం’ అంటూ ఒక్క ముక్క మాట్లాడి వెళ్లిపోయారని నర్సులు మండిపడ్డారు. దీంతో సీనియర్, జూనియర్ నర్సింగ్ ఆఫీసర్ల బదిలీ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో మళ్లీ కౌన్సెలింగ్ ఎప్పుడు నిర్వహిస్తారో తెలపాలని తెలంగాణ (ప్రభుత్వ) నర్సెస్ అసోసియేషన్ ప్రతినిధులు శనివారం డీపీహెచ్‌కు వినతిపత్రం అందించారు. జోన్ల వారీగా సీనియార్టీ లిస్టును, లాంగ్ స్టాండింగ్ జాబితాను, 40 శాతం తప్పనిసరి బదిలీల జాబితాను విడుదల చేయాలని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియమ్మ కోరారు. సీనియర్లకు పదోన్నతులు కల్పించాలని అన్నారు. ఏ క్యాటగిరీలో ఎవరెవరిని బదిలీ చేస్తున్నారో జాబితాలో స్పష్టంగా పేరొనాలని డిమాండ్ చేశారు.
డీపీహెచ్ పరిధిలో హెడ్ నర్సుల కౌన్సెలింగ్ శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి జరుగాల్సి ఉండగా.. సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమైంది. ఇందులోనూ సీనియార్టీ లి స్టు తప్పుల తడకగా ఉన్నదంటూ హెడ్ నర్సు లు మండిపడ్డారు. శుక్రవారం నాటి ఘటనల నేపథ్యంలో ఉస్మానియా మెడికల్ కాలేజీ ముందు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. సుల్తాన్‌బజార్ ఏసీపీ శంకర్ నేతృత్వంలో సుల్తాన్‌బజార్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసాచారి, నారాయణగూడ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, అఫ్టల్గంజ్ ఇన్స్పెక్టర్ లింగేశ్వర్‌రావు, సుల్తాన్ బజార్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాంబాబు, ఎస్ఐలు కిరణ్‌కుమార్‌రెడ్డి, మధుసూదన్, శ్వేత బందో బస్తులో పాల్గొన్నారు.
చీఫ్ నర్సింగ్ ఆఫీసర్ల బదిలీలో శనివారం కొత్త రగడ మొదలైంది. యూనియన్ల పేరుతో దశాబ్దాలుగా హైదరాబాద్‌లో పాతుకుపోయిన ఓ నర్సింగ్ ఆఫీసర్‌ను రిటెయిన్ చేయడంపై ఇతర సిబ్బంది మండిపడుతున్నారు. ఆమెకు సంబంధం లేని ఉద్యోగ సంఘం నుంచి ఆఫీస్ బేరర్ లెటర్ తీసుకొచ్చిందని ఆరోపిస్తున్నారు.
నర్సింగ్ ఆఫీసర్ల బదిలీలు రచ్చకెక్కడంతో డీపీహెచ్ పరిధిలోని డిప్యూటీ డైరెక్టర్(అడ్మిన్), ఫార్మసీ, ల్యాబ్, ఏఎన్ఎమ్, ఎమ్పీహెచ్డబ్ల్యూ (మేల్, ఫీమెల్) తదితర క్యాడర్ల కౌన్సిలింగ్ కూడా సక్రమంగా జరగలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీనియార్టీ జాబితా తప్పుల తడకగా ఉన్నదని, అర్హత లేకున్నా స్పౌజ్, ఇతర కారణాలతో చాలామందిని రిటెయిన్ చేశారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇందుకు డిప్యూటీ డైరెక్టర్ (అడ్మిన్) బదిలీలను ఉదాహరణగా చూపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 13 మంది ఉండగా, హైదరాబాద్‌లోనే 11 మంది పనిచేస్తున్నారు. వీరిలో ఐదుగురు లాంగ్ స్టాండింగ్ అధికారులు ఉండగా.. నలుగురిని స్పౌజ్ కోటా కింద రిటెయిన్ చేశారు. అయితే ఇందులో ఇద్దరికి మాత్రమే అర్హత ఉన్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఆరోగ్యశాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేరినట్టు సమాచారం. పలువురు యూనియన్ల నేతలు మధ్యవర్తుల అవతారం ఎత్తి రూ.లక్షలు వసూలు చేసి, కీలక అధికారులకు ముట్టజెప్పారని, అందుకే ఇలా అక్రమ బదిలీలు జరిగాయని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై వైద్యారోగ్య శాఖ మంత్రి స్పందించి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.