సంగారెడ్డి కలెక్టరేట్/బంట్వారం, ఆగస్టు 24: చేసిన పాపం వెంటాడింది.. తల్లీదండ్రులకు ఏ విధంగానైతే మత్తు మందు ఇచ్చి హత్య చేసిందో.. అదే మత్తు మందుతో తాను ఆత్మహత్య చేసుకుంది. ‘ప్రేమ’ అనే పదానికి ఈ ముగ్గురు బలయ్యారు. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలానికి చెందిన ఓ యువతి ఇన్స్టాగ్రాంలో ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఓ ప్రైవేట్ దవాఖానలో నర్సుగా పనిచేస్తున్న ఆమె ఈ విషయాన్ని జనవరిలో తన తల్లిదండ్రులకు చెప్పింది. ఆమె ప్రేమను వారు అంగీకరించలేదు.
దీంతో తన ప్రేమకు అడ్డుగా ఉన్న తల్లిదండ్రులను తప్పించాలనుకున్న ఆమె మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. దీంతో కుప్పకూలిన వాళ్లు మృతిచెందారు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు నర్సు సురేఖ(25)ను అరెస్టు చేసి జైలుకు పంపారు. ఇటీవల జైలు నుంచి విడుదలైన సురేఖ సొంతూరుకు వెళ్లలేక సంగారెడ్డిలోని ఓ హాస్టల్లో ఉంటూ నర్సుగా పనిచేయడం మొదలుపెట్టింది. అయితే తాను చేసిన తప్పు వెంటాడటంతో తీవ్ర మానసిక క్షోభకు గురై ఏ మత్తు మందుతోనైతే తల్లిదండ్రులను కడతేర్చిందో అదే మత్తు మందుతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.