హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్(ఏటీఆర్)లో పులుల సంఖ్య పెరుగుతున్నది. గత అంచనాలో 36గా ఉన్న పులుల సంఖ్య తాజా గణనలో 42కి పెరిగినట్టు తేలింది. అటవీశాఖ ప్రాథమిక విశ్లేషణ ప్రకారం అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్‌లో 18 ఆడ పులులు, 14 మగ, రెండు ఉప-వయోజన పులులు, ఎనిమిది పిల్లలు ఉన్నట్టు గుర్తించారు. పిల్లలు, ఉప-వయోజన పులులు ఉండటం అనేది విజయవంతమైన సంతానోత్పత్తికి, రిజర్వ్‌లో ఆరోగ్యకరమైన, సంతానోత్పత్తి సామర్థ్యం కలిగిన పులుల సమూహం ఉందనడానికి సంకేతంగా అధికారులు పేర్కొంటున్నారు. మొత్తం ఎనిమిది పులి పిల్లలను గుర్తించారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పులుల సంఖ్యను 36 నుంచి 42కి పెంచగలిగామని ఏటీఆర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ సునీల్ ఎస్ హిరేమత్ తెలిపారు. రిజర్వ్‌లో మగ పులులకంటే ఆడ పులులే ఎకువగా ఉండటం మంచి పరిణామం అన్నారు.