హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని జైళ్లలో నిరుడు ఖైదీల సంఖ్య భారీగా పెరిగింది. 2025లో మొత్తం 42,566 మంది వివిధ నేరాలకు పాల్పడి జైళ్లపాలయ్యారు. వీరిలో 40,090 మంది కొత్త ఖైదీలేనని, గతంలో వీరికి ఎలాంటి నేర చరిత్ర లేదని జైళ్ల డీజీ సౌమ్య మిశ్రా వెల్లడించారు. రిపీట్ అఫెండర్స్ (పదే పదే నేరాలకు పాల్పడినవారు) 2,496 మంది మాత్రమే ఉన్నట్టు తెలిపారు. సోమవారం ఆమె చంచల్‌గూడ ప్రిజన్స్ అకాడమీలో జైళ్ల శాఖ ఐజీలు మురళీబాబు, రాజేశ్, డీఐజీలు సంపత్, శ్రీనివాస్‌లతో కలిసి 2025 వార్షిక నివేదిక విడుదల చేశారు. ఈ సందర్భంగా సౌమ్య మిశ్రా మాట్లాడుతూ.. నిరుడు జైళ్ల పాలైన 42,566 మంది ఖైదీల్లో 18-30 ఏండ్ల లోపువారు 19,413 మంది, 31-50 ఏండ్ల లోపువారు 19,318 మంది, శిక్షలు పడిన ఖైదీలు 5,856 మంది ఉన్నట్టు వివరించారు. గతంతో పోలిస్తే నిరుడు రాష్ట్రంలో తీవ్రమైన నేరాలకు పాల్పడినవారి సంఖ్య పెరిగిందని చెప్పారు.
ఖైదీల సంక్షేమానికి కృషి
జైళ్లలో ఖైదీల సంక్షేమానికి పలు చర్యలు చేపడుతున్నామని, వారికి ఎప్పటికప్పడు హెల్త్ చెకప్‌లు చేయిస్తున్నామని సౌమ్య మిశ్రా తెలిపారు. 23,220 మంది ఖైదీలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దామని, ఈ ఏడాది మార్చిలో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యేందుకు 28 మంది ఖైదీలు సిద్ధమవుతున్నారని వివరించారు. ఉపాధి కోసం నిరుడు 28 విభాగాల్లో 4,615 మంది ఖైదీలకు శిక్షణ ఇచ్చామని, వొకేషనల్ యాక్టివిటీస్‌లో భాగంగా వివిధ విభాగాల్లో పనులు చేసిన 15,788 మంది ఖైదీలకు రూ.1,63, 91,498, వ్యవసాయ పనులు చేసిన 85 మంది ఖైదీలకు రూ.9,57,650, పెట్రోల్ బంకుల్లో సేవలందిస్తున్న 212 మంది ఖైదీలకు రూ.3,79,70,170 వేతనంగా ఇచ్చామని వెల్లడించారు. జైళ్ల శాఖ ఉత్పత్తులను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో లాంటి ఈ-కామర్స్ సైట్లలో అమ్మేందుకు చర్యలు చేపట్టినట్టు చెప్పారు.
ఆ లెక్కలన్నీ సీఎం చూస్తున్నారు..
తెలంగాణ జైళ్ల శాఖకు ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు, వివిధ రకాల ఉత్పత్తుల ద్వారా ఖైదీలకు వస్తున్న రాబడి, ఖర్చుల గురించి ‘నమస్తే తెలంగాణ’ అడిగిన ప్రశ్నకు సౌమ్య మిశ్రా సమాధానాన్ని దాటవేశారు. ప్రస్తుతం రాష్ట్ర హోంశాఖ ముఖ్యమంత్రి పరిధిలో ఉన్నందున ఆ లెక్కలన్నీ ముఖ్యమంత్రే చూసుకుంటున్నారని తెలిపారు. సిగాచి పరిశ్రమ ఎండీకి సంగారెడ్డి జైలులో రాచమర్యాదలు చేస్తున్న వైనంపై ప్రశ్నించగా.. ఖైదీలందరినీ ఒకేవిధంగా చూస్తున్నామని చెప్పారు. ఎన్ఐఏ, ఈడీ లాంటి సంస్థలు దర్యాప్తు జరుపుతున్న హైప్రొఫైల్ కేసుల్లో నిందితుల కోసం సిద్దిపేట జైలులో ప్రత్యేకంగా హైసెక్యూరిటీ కలిగిన ‘స్వస్తికా సెల్స్’ ఏర్పాటు చేశామని, సీఎం చేతుల మీదుగా త్వరలో సిద్దిపేట జైలును ప్రారంభిస్తామని వివరించారు.
