Digital Arrest | హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): డిజిటల్ అరెస్టులో మరో వికృత రూపం బయటపడింది. సైబర్ నేరాలను అదుపు చేయడానికి కేంద్రం పటిష్ట చర్యలు చేపట్టకపోవటంతో సైబర్ దొంగలు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకొని డబ్బులు కొల్లగొడుతున్నారు. కొడుకు/కూతురు సెక్స్ రాకెట్లో దొరికారని, డ్రగ్స్ కేసుల్లో పట్టుబడ్డారని, వారు చదువుతున్న కాలేజీ, ఇతర వివరాలన్నీ సరిగ్గా చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఆధార్, పాన్‌కార్డ్ తమ వద్ద ఉన్నదని నకిలీ జిరాక్స్‌లు చూపుతున్నారు. ఆ తర్వాత ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఎక్కడికి వెళ్లారు? ఎప్పుడు వస్తారు? అనే వివరాలు తెలుసుకొని వీడియోకాల్‌లోనే మహిళలను దుస్తులు విప్పాలని బెదిరిస్తున్న ఘటనలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. అలా చేస్తే కేసు మాఫీ చేస్తామని కొందరు, మభ్యపెట్టి న్యూడ్ కాల్స్ రికార్డు చేసి, ఆ తర్వాత డబ్బులు డిమాండ్ చేసే మరికొన్ని ఘటనలు పోలీసుల దృష్టికి వచ్చాయి. ఇటీవల తెలంగాణలోనూ ఓ యువతిని ఇదే తరహా న్యూడ్ డిజిటల్ అరెస్టుకు ప్రయత్నించగా ఆమె.. సైబర్ నేరగాళ్ల ఎత్తుగడలను తిప్పికొట్టినట్టు తెలిసింది. వారి మాయమాటల నుంచి తేరుకొని తక్షణం ఆమె 1930కి కాల్ చేయగా.. ఆ నంబర్ నుంచి మాట్లాడిన సైబర్ నేరస్థుడి కోసం సీఎస్బీ పోలీసులు దృష్టి సారించినట్టు సమాచారం.
స్కామర్ కాల్‌తో ఆగిన టీచర్ గుండె
ఆగ్రాలో సైబర్ నేరగాళ్ల వేధింపులకు ఓ తల్లి గుండె ఆగిపోయింది. ఆగ్రాలో ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్న మాల్తీ వర్మకు పోలీస్ వేషధారణలో ఉన్న ఓ వ్యక్తి నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. తన కూతురు చదువుతున్న కాలేజ్, ఉంటున్న ఏరియా, ఆధార్ కార్డు నంబర్‌తో సహా అన్నీ వివరించాడు. అప్పటికే భయపడిపోతున్న మాల్తీ వర్మను డిజిటల్ అరెస్టు చేసే క్రమంలో.. తన కూతురు ఓ సెక్స్ రాకెట్లో దొరికిందని చెప్పాడు. తక్షణం తాను చెప్పిన ఖాతాకు రూ.లక్ష వేస్తే కేసు కాకుండా మాఫీ చేస్తానని చెప్పాడు. అతన్ని పోలీసు అధికారిగా భావించిన మాల్తీ వర్మ.. అతని మాటలకు మరింత భయపడిపోయింది. తన కూతురి గురించి అలాంటి వార్త వినాల్సి రావడంతో బోరున విలపిస్తూనే తీవ్ర ఆందోళన, ఒత్తిడికిలోనై గుండెపోటుతో చనిపోయింది. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ వృద్ధ జంటను ఇలాగే డిజిటల్ అరెస్టు చేసి, రూ.10 కోట్లకు పైగా కొల్లగొట్టారు.
సైబర్ దొంగలకు ఆ వివరాలెక్కడివి?
బాధితుల తల్లిదండ్రులకు సైబర్ నేరగాళ్లు కాల్స్ చేసి, వారి కొడుకు లేదా కూతురు పేరు సరిగ్గా చెప్పటం, వారు ఏం చదువుతున్నారో చెప్పటం, ఏ రాష్ట్రంలో, ఏ కాలేజ్‌లో చదువుతున్నారో క్లియర్‌గా చెప్పటం గమనార్హం. పోలీసు దుస్తుల్లో వీడియో కాల్ చేయడం, బ్యాగ్రౌండ్ సెటప్ మొత్తం పోలీస్‌స్టేషన్‌లా ఉంటుండటంతో బాధితులు నిజమేమోనని నమ్ముతున్నారు. బాధితులను వీడియో కాల్‌లోనే ఉంచి.. కస్టమ్స్, ఎన్డీపీఎస్, ఈడీ, ఎన్ఐఏ, ఆయా రాష్ర్టాల పోలీసుల లోగోలతో నకిలీ ఎఫ్ఐఆర్లు పంపడంతో మరింత కంగారు పడుతున్నారు. వీడియోలోనే దుస్తులు విప్పేయాలని డిమాండ్ చేయటం, వాటిని రికార్డు చేయడం, అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఆన్లైన్లో పెడతామని బెదిరించడం, పోలీసు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామని హింసిస్తున్న పలు సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.
సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచనలివే..