హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ రైతు పక్షపాత పార్టీ అని, కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని, ఇక మున్ముందు అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీకే పట్టం కట్టాలని ఎన్నారై బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఇన్చార్జి అనిల్ బైరెడ్డి పిలుపునిచ్చారు. ఇటీవల ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ ఆదివారం ఆస్ట్రేలియా మెల్బోర్న్లో సీఎం కేసీఆర్ కృతజ్ఞత సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతును రాజు చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టి, వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
రైతు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుపడుతుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏ నినాదంతో అయితే అధికారంలోకి వచ్చిందో నీళ్లు, నిధులు, నియామకాలు అన్నీ సక్రమంగా జరుగుతున్నాయని కొనియాడారు. మరొకసారి తెలంగాణలో అధికారం బీఆర్ఎస్కే ఇవ్వాలని ఎన్నారైల కుటుంబ సభ్యులందరూ కోరుకుంటున్నారని పేర్కొన్నారు. పంజాబ్, గుజరాత్ కమ్యూనిటీకి సంబంధించిన లీడర్లు మాట్లాడుతూ దేశంలో ఎకడలేని విధంగా రైతుల కోసం కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని, ఇలాంటి నాయకుడు రాష్ర్టానికి పరిమితం కాకుండా రానున్న రోజుల్లో దేశానికి నాయకత్వం వహించాలని కోరుతున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ నాయకులు రమేశ్ ముత్యాల, మధు పార్స, రవీందర్ చుక, సత్యనారాయణ గుండా, మధు పైల తదితరులు పాల్గొన్నారు.