రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. జేఏసీ అధ్యక్షుడు మోతీలాల్నాయక్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 1లోగా నోటిఫికేషన్లు విడుదల చేయకపోతే నిరుద్యోగులతో సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో భారీ సింహగర్జన నిర్వహిస్తామని తెలిపారు. అప్పటికీ స్పందించకపోతే ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ముందు ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని ప్రకటించారు.
రాష్ట్ర బడ్జెట్లో దివ్యాంగులకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క తీరుకు నిరసనగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో దివ్యాంగులు ఆందోళనకు దిగారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలంలోని కందగట్ల లో శుక్రవారం బండరాళ్లు తలపై పెట్టుకొని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేశ్ మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి పైసా నిధులు కేటాయించకుండా చిన్నచూపు చూశారని ఆవేదన వ్యక్తం చేశారు.
వేతనాలు చెల్లించి, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రొయ్యూరు మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ వద్ద శుక్రవారం ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, కన్నాయిగూడెం మండలాలకు చెందిన కార్మికులు ధర్నా నిర్వహించారు. ప్రతి కార్మికుడికి వెంటనే ఐడీ కార్డు ఇవ్వడంతోపాటు పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.