హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్‌తోపాటు సభ్యుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన ఔత్సాహికులు ఈ నెల 18 సాయంత్రం 5 గంటల లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అంటే నెలలోపే టీఎస్పీఎస్సీకి నూతన చైర్మన్, సభ్యులను ప్రభుత్వం నియమించే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్‌రెడ్డితోపాటు సభ్యులు ఇటీవల చేసిన రాజీనామాలకు గవర్నర్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో సీఎస్ శాంతికుమారి ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. అభ్యర్థులు www.telangana.gov.in వెబ్సైట్ నుంచి దరఖాస్తు నమూనా పత్రాలను డౌన్లోడ్చేసుకోవచ్చని సూచించింది. కమిషన్ చైర్మన్ సభ్యుల పదవులకు కావాల్సిన అర్హతలు, ఇతర వివరాలను ఈ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నది. దరఖాస్తులను secy-ser-gad@telangana.gov.in సమర్పించాలని వెల్లడించింది. పభుత్వం ని యమించిన సెర్చ్ కమ్ స్క్రీనింగ్ కమిటీ ద్వా రా ఎంపిక ప్రక్రియను చేపడతామని తెలిపింది. ఆర్టికల్ 316 ప్రకారం చైర్మన్, సభ్యులను గవర్నర్ నియమిస్తారు. చైర్మన్ లేదా సభ్యుడు ఆరేండ్లు లేదా 62 ఏండ్ల వయస్సు ఈ రెండింటిలో ఏది ముందు పూర్తయితే అంత వరకు పదవిలో కొనసాగుతారు.