హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): ఏదైనా కేసులో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ) సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చి సాక్షులను విచారణ కోసం పిలిచే అధికారం సంబంధిత పోలీసు అధికారులకు ఉంటుంది. ఈ సెక్షన్ ప్రకారం, ఒక కేసును దర్యాప్తు చేస్తు న్న పోలీస్ అధికారి ఆ కేసుకు సంబంధించిన విషయాలు తెలిసి ఉంటాయని భావించే ఏ వ్యక్తినైనా తన ముందుకు రావాలని లిఖితపూర్వక నోటీసు ద్వారా ఆదేశించవచ్చు. అయితే, ఈ చట్టం ప్రకారం 15 ఏండ్లలోపు ఉన్న మైనర్లను, 65 ఏండ్లు పైబడిన వృద్ధులను, స్త్రీలు (ఏ వయసు వారైనా సరే), శారీరక లేదా మానసిక వైకల్యం ఉన్న వ్యక్తులను సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు పిలిచి విచారించేందుకు మినహాయింపు ఇచ్చారు.
వీరిని పోలీస్ స్టేషన్‌కు రమ్మ ని బలవంతం చేయకూడదు. వారి నివాస స్థలం లేదా వారు కోరుకున్న చోటనే విచారించాలి. వారికి సమ్మతమైతే తప్ప.. పోలీస్‌స్టేషన్‌కు పిలువకూడదు. ఇక సబ్-ఇన్స్పెక్టర్ లేదా అంతకంటే పైస్థాయి అధికారికి ఈ 160 సెక్షన్ కింద నోటీసులు ఇచ్చే అధికారం ఉంటుంది. నోటీసు తప్పనిసరిగా రాతపూర్వకంగా ఉం డాలి. అధికారి తన పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్నవారిని లేదా పకనే ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలోని వారిని పిలువవచ్చు.
సాక్షి పోలీస్ స్టేషన్‌కు రావడానికి అయ్యే ప్రయాణ ఖర్చులను ప్రభుత్వమే చెల్లించాలి. ఒకవేళ సరైన కా రణం లేకుండా పోలీసు నోటీసును బేఖాతరు చేస్తే, ఐపీసీ సెక్షన్ 174 కింద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సీఆర్పీసీ స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్) అమల్లోకి వచ్చింది. బీఎన్ఎస్ఎస్లో ఈ నిబంధనలు సెక్షన్-179 కిం దకు వస్తాయి. అయితే, ప్రాథమిక నియమాలు దాదాపు ఒకేలా ఉన్నాయి. సీఆర్పీసీలో 65 ఏండ్లు పైబడిన వారిని స్టేషన్‌కు పిలువొద్దని ఉంటే.. బీఎన్ఎస్ఎస్లో దానిని 60 ఏండ్లకు తగ్గించారు. బీఎన్‌ఎస్‌స్ సెక్షన్ 179 కింద నోటీసులను ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ (వాట్సాప్, ఈ-మెయిల్ మొదలైన) వాటి ద్వారా కూడా ఇవ్వొచ్చు.